భారతీయ జనతా పార్టీలో చేరి.. బ్యాంకులకు లోన్లు ఎగ్గొట్టిన కేసుల నుంచి విచారణ వేధింపుల గండం గట్టెక్కిన ఎంపీ సుజనా చౌదరికి కొత్త కష్టాలొచ్చాయి. గతంలో బ్యాంకుల ఫిర్యాదు మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థలు జారీ చేసిన లుకౌట్ నోటీసులు అమల్లో ఉన్నాయని.. తనను అమెరికా వెళ్లకుండా అడ్డుకుంటారని ఆయన ఆందోళన చెందారు. తనను అడ్డుకోకుండా ఆదేశాలివ్వాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. లుకౌట్ నోటీసులపై స్టే ఇవ్వాలని కోరారు. ఈ మేరకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో ఆయన అమెరికా పయనమవుతున్నారు.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత వరకూ సుజనా చౌదరి టీడీపీలో ఉన్నారు. అప్పట్లో ఆయనపై పలు రకాల బ్యాంక్ ఫ్రాడ్ కేసులు ఉన్నాయి. చెన్నై, బెంగళూరుల్లో ఐటీ, ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలు ఆయనను ప్రశ్నించాయి. ఎన్నికల తర్వాత టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో ఆయన బీజేపీలో చేరారు.ఆ తర్వాత ఆయా దర్యాప్తు సంస్థల నుంచి నోటీసులు రావడం కానీ.. విచారణకు పిలిచినట్లుగా కానీ ఎక్కడా సమాచారం బయటకు రాలేదు. తాజాగా తనను అమెరికా వెళ్లకుండా అడ్డుకుంటారనే అనుమానంతో స్వయంగా కోర్టులో పిటిషన్ వేయడంతోనే విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ లుకౌట్ నోటీసులు గతంలోనే జారీ చేసినట్లుగా భావిస్తున్నారు. వాటిని క్యాన్సిల్ చేయించుకోవడంలో విఫలం కావడంతో.. హైకోర్టు నుంచి ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకున్నట్లుగా చెబుతున్నారు. సాధారణంగా లుకౌట్ నోటీసులు ఉంటే… దేశం నుంచి బయటకు వెళ్లేందుకు అంగీకరించరు. అదుపులోకి తీసుకుని సంబధిత దర్యాప్తు సంస్థలకు అప్పగించడమో.. వెనక్కి పంపడమో చేస్తారు. ఇలా జరిగితే మరింత వివాదాస్పదం అవుతుంది. అందుకే సుజనా ముందు జాగ్రత్త పడినట్లుగా తెలుస్తోంది.