బీహర్ ఎన్నికల మూడో విడత పోలింగ్‌కు ముందు రోజు… ఇవే తనకు చివరి ఎన్నికలని సీఎం నితీష్ కుమార్ ఎమోషనల్‌గా ప్రకటించారు. అది చర్చనీయాంశం అయింది. అయన ఓటర్లను ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారని ఇతర పార్టీలు విమర్శలు గుప్పించాయి. ఇప్పుడు ఎన్నికలైపోయాయి. ఫలితాలు కూడా వచ్చాయి. నితీషే మళ్లీ ముఖ్యమంత్రి అవుతున్నారు. మరి ఆయన ఆ మాటకే కట్టుబడి ఉన్నారు. ఇక ఎన్నికలకు ఆయన దూరమా..? . .. ఇదే సందేహం జర్నలిస్టులకు వచ్చింది. ఆయననే అడిగారు. కానీ ఆయన చెప్పిన సమాధానం విని.. నోరెళ్లబెట్టాల్సి వచ్చింది.
ఎన్నికల ర్యాలీలో తాను అసలు తన రిటైర్మెంట్ గురించి చెప్పలేదని చెప్పుకొచ్చారు. ముగింపు బాగుంటే, అంతా బాగుంటుందనే మాటను మాత్రమే తాను చెప్పానని.. దానర్థం రిటైర్మెంట్ కాదన్నారు. మీడియానే తప్పుగా అర్థం చేసుకుందని కవరింగ్ చేసుకున్నారు. దీంతో నితీష్ కుమార్ కూడా.. ఇతర ఏ రాజకీయ నేతలకూ తగ్గరని జర్నలిస్టులు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రాజకీయ నేతల రిటైర్మెంట్ తీసుకోవడం అనేదే ఉండదు. ప్రజలు పట్టించుకోవడం మానేస్తే.. వారే పక్కకు వెళ్తారేమో కానీ.. తమకు వయసయిపోయిందని కానీ.. మరో కారణంగా కానీ.. వారు ఎప్పుడూ.. రాజకీయాల నుంచి వదిలి వెళ్లరు. దానికి నితీష్ కూడా మినహాయింపు కాదని తేలిపోయింది.
అయితే రాజకీయాల్లో రిటైర్మెంట్ ప్రకటనలు.. రాజకీయ సన్యాసం సవాళ్లు కామన్‌గా వస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడూ పాటించరు. ఎదుటి వారు తన సవాల్ ను స్వీకరించలేదనో…తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారనో .. రకరకాలుగా కవర్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా నితీష్ కుమార్ కూడా అదే బాట ఎంచుకున్నారు. ఆయన మరిన్ని ఎన్నిక్లలో తే్జస్వితో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు.