గ్రేటర్ ఎన్నికల కోసం శరవేగంగా సన్నాహాలు చేసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వ పెద్దలు.. పనిలో పనిగా ప్రజలకు వరాలు ప్రకటించారు. ఆస్తిపన్నులో సగానికి సగం రాయితీ ఇచ్చేశారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గ్రేటర్ పరిధిలో పన్ను చెల్లించే ఇళ్ల యజమానులకు యాభై శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు. అయితే ఈ పన్ను రూ. పదిహేను వేల లోపు మాత్రమే ఉండాలి. అయితే ఇప్పటికే వివిధ రకాల స్కీమ్‌లు పెట్టి.. చాలా వరకూ పన్నులు వసూలు చేశారు. కరోనా టైంలో.. పది శాతం డిస్కౌంట్ ఇచ్చారు. ఆ తర్వాత కూడా కొన్ని స్కీమ్స్ పెట్టి వసూలు చేశారు. అలా కట్టిన వారందరూ అసంతృప్తికి గురవుతారు కాబట్టి.. వారికి కూడా ప్రతిఫలం అందేలా నిర్ణయం తీసుకున్నారు .
ఇప్పటికే ఆస్తి పన్ను చెల్లించిన వారికి వచ్చే ఏడాది చెల్లించాల్సిన మొత్తంలో మినహాయింపు ఇస్తామని కేటీఆర్ హామీ ఇమీ ఇచ్చారు. వరద సాయం విషయంలో ప్రజల్లో అసంతృప్తి ఉందన్న విషయాన్ని కేటీఆర్ గుర్తించారు. చాలా చోట్ల వరద సాయం కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని వరద సాయం అందని వారు ఈసేవల్లో నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అవసరమైతే మరో రూ.100 కోట్లు సాయం చేస్తామన్నారు. ఇక ఎన్నికల పుణ్యమా అని జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకూ మంచి రోజులు వచ్చాయి వారి వేతనం రూ.14,500 నుంచి రూ.17,500కు పెంచారు.
గ్రేటర్ ఎన్నికలను వీలైనంత త్వరగా ముగించాలన్న లక్ష్యంతో ఉన్న తెలంగాణ సర్కార్ పెద్దలు.. చకచకా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే తాయిలాలు ప్రకటిస్తున్నారు. అయితే గతంలో ఇంటి పన్ను రూపాయి మాత్రమే ఉంటుందనే హామీ ఇచ్చారు. కానీ మర్చిపోయారు. ఇప్పుడు.. యాభై శాతం డిస్కౌంట్‌తో తెరపైకి వస్తున్నారు. మరి వర్కవుట్ అవుతుందో లేదో..?