మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిస్థితి వైసీపీలో రాను రాను దూరం దూరం అన్నట్లుగా అయిపోతోంది. ఇటీవలి కాలంలో ఆయనపై ఇంటలిజెన్స్ ప్రత్యేకంగా నిఘా పెట్టిందని కథనాలు రాగా.. ఇప్పుడు… ప్రభుత్వ కీలక సమావేశాలకూ ఆయనకు పెద్దగా సమాచారం ఉండటం లేదని చెబుతున్నారు. సీనియర్ మంత్రిగా ఉన్నప్పటికీ.. ఆయనకు చెందిన శాఖకు సంబంధించిన నిర్ణయాలను ముఖ్యమంత్రి సలహాదారులే తీసుకుంటున్నారు. ఇసుక విధానం విషయంలో తీవ్రమైన విమర్శలు రావడంతో పాటు.. ఏపీ సర్కార్ పెద్దలు కొత్తగా ఆలోచించి.. తమదైన పద్దతిలో నిర్ణయం తీసుకున్నారు. ఇసుక మొత్తం ఒక్కరికే కట్ట బెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయంలో మంత్రి పాత్ర పరిమితంగా ఉంది.
గతంలో వైసీపీలో ఉన్న అత్యంత సీనియర్లుగా కొన్ని విధానపరమైన ప్రకటనలకు.. ఆయనకు అవకాశం ఇచ్చేవారు. కానీ ఇప్పుడు పార్టీ తరపున కానీ.. ప్రభుత్వం తరపున కానీ ఆయన మీడియా ముందుకు వచ్చే అవకాశం పెద్దగా కల్పించడం లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రాధాన్యత తగ్గుతోందన్న విషయం మాత్రం.. చాలా స్పష్టంగా ఉందని వైసీపీలోనే గుసగుసలు ప్రారంభమయ్యాయి. దీనికి కారణం.. ఆయన వ్యవహారశైలేనని చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి న్యాయవ్యవస్థతో ఢీ కొడుతూండటం.. ఆయన కేసుల రెగ్యూలర్ విచారణ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని.. పెద్దిరెడ్డి వ్యూహాత్మకంగా.. ఎమ్మెల్యేలతో సాన్నిహిత్యం పెంచుకుంటున్నారని అంటున్నారు.
ఒక్క రోజా తప్ప చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు మొత్తం ఆయన గుప్పిట్లోనే ఉంటారు. ఇతర జిల్లాల ఎమ్మెల్యేలతోనూ ఆయన టచ్లో ఉంటున్నారన్న ప్రచారం ఊపందుకుంది. దీంతో.. ప్రభుత్వ పెద్దలు ఆయనపై ఇంటలిజెన్స్ నిఘా పెట్టించారని.. ప్రాధాన్యత తగ్గించారని చెబుతున్నారు. గతంలో.. పెద్దిరెడ్డి కుమారుడు.. ఎంపీ మిథున్ రెడ్డి జగన్ తో అత్యంత సన్నిహితంగా ఉండేవారు. ఢిల్లీలో కీలక సమావేశాల్లో పాల్గొనేవారు. ఇప్పుడు అలాంటి అవకాశాన్ని కల్పించడం లేదన్న ప్రచారం జరుగుతోంది. మొత్తానికి వైసీపీలో ఎవరి రాజకీయం వారిదన్నట్లుగా పరిస్థితి మారిందన్న చర్చ జరుగుతోంది.