తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. రేసులో ఉందో లేదో తేల్చుకోవాల్సిన మరో లిట్మస్ టెస్టు ఎదురవుతోంది. అదే జీహెచ్ఎంసీ ఎన్నికలు. తెలంగాణ భవిష్యత్ నేతను కూడా ఈ ఎన్నికలతో ఖరారు చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఫైర్ బ్రాండ్ లీడర్ రేవంత్ రెడ్డిని గ్రేటర్ ఎన్నికలకు కాంగ్రె స్ తరపున ఇన్చార్జ్ గా నియమిస్తారన్న ప్రచారం జరుగుతోంది. దుబ్బాక ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ కార్యకర్తల్లో తీవ్రమైన నైరశ్యం ఏర్పడింది. పలు చోట్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి దిష్టిబొమ్మలు కూడా తగులబెట్టారు. దుబ్బాకలో గౌరవనీయమైన ఓటమి కూడా కాకపోవడంతో.. ఇప్పుడైనా సరైన నేత చేతుల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీని పెట్టకపోతే ఇక పార్టీ గురించి మర్చిపోవచ్చని నిష్టూరాలు వినిపించాయి.
అయితే.. ఇంత జరిగినా కాంగ్రెస్ లో వర్గ పోరాటం మాత్రం మారలేదు. దుబ్బాక ఫలితాల తర్వాత ఖమ్మం జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో రేవంత్ – వీహెచ్ మధ్య వాగ్వాదం నడిచింది. దీంతో.. ఏం జరిగినా.. కాంగ్రెస్లో మార్పు రాదన్న చర్చ ప్రారంభమయింది. అయితే.. ఇటీవలే తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ గా బాధ్యతలు చేపట్టిన మాణిగం ఠాగూర్ మాత్రం… పక్కా ప్రణాళికతో ఉన్నారు. ఆయన మొగ్గు రేవంత్ వైపే ఉన్నప్పటికీ.. సీనియర్లందరినీ సంతృప్తి పరిచి.. ఆయనకు పీఠం ఇవ్వాలంటే ఓ బలమైన ప్రాతిపదిక ఉండాలనుకుంటున్నారు. అందుకే.. గ్రేటర్ ఎన్నికల బాధ్యతను రేవంత్ కు అప్పగించాలనే ఆలోచన చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని మల్కాజిగిరి నుంచి రేవంత్ ఎంపీగా గెలిచారు. ఇప్పటికే తన నియోజకవర్గం పరిధిలో ఉన్న కార్పొరేటర్ సీట్లపై ప్రత్యేకంగా కసరత్తు కూడా చేస్తున్నారు.
ఈ క్రమంలో మొత్తం గ్రేటర్ బాధ్యత ఇస్తే… బెటర్ అన్న అభిప్రాయానికి ఠాగూర్ వస్తున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ రేసులో ఉందా లేదా అన్నది తేలాలంటే… గ్రేటర్ ఎన్నికలు అత్యంత కీలకం. గ్రేటర్లో గెలవకపోయినా పట్టు సాధించే సూచనలు వచ్చేలా చేసుకున్నా పార్టీపై నమ్మకం ఉంటుంది. లేకపోతే గల్లంతవుతుంది. రేవంత్ కి ఇన్చార్జ్ ఇస్తే.. తన రాజకీయ భవిష్యత్ కోసమైనా ఆయన కాంగ్రెస్ కోసం సర్వశక్తులు ఒడ్డక తప్పదు. ఈ విషయంలోనూ కాంగ్రెస్ హైకమాండ్ నాన్చుతుందో.. ముందే తేల్చుతుందో అనే డౌట్ కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ఉంది.