తెలుగులో ప్రముఖ చానళ్లుగా ఉన్న వాటిలో ఎన్టీవీది భిన్నమైన శైలి. ఇష్టమైన నేతలకు ప్రచారం చేయడంతో పాటు.. ఆ ఇష్టమైన నేతలకు ఇష్టం లేని వారిపై దుమ్మెత్తి పోయడంలోనూ.. తనదైన మార్క్ చూపిస్తూ ఉంటుంది. రాజ్యాంగ పదవిలో ఉన్న ఎస్ఈసీపై అవాకులు.. చెవాకులు పేలుతూ..మీడియా స్వేచ్చ పేరుతో అరగంట కథనాలు రాయడమే కాదు.. ఇప్పుడు.. దుబ్బాక ఉపఎన్నిక తర్వాత కేసీఆర్కు కష్టం వచ్చిందని.. రంగంలోకి దిగారు. ఆయన ఉద్యమ చరిత్రను చెబుతూ.. ఆయన నిబద్దతను గుర్తు చేస్తూ.. దీపావళిసంబరాలను పక్కన పెట్టి మరీ.. ఓ అరగంట కథనం వండి వార్చారు. ఒక్క ఓటమితో ఆయన ప్రభ మసకబారదని.. అంతిమంగా ఆ అరంగటంలో చెప్పుకొచ్చారు.
కేసీఆర్ ప్రాపకం కోసం పొగిడేందుకు ఎన్టీవీ ఈ కథనం రాసినట్లుగా స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఎందుకంటే.. దుబ్బాక ఓటమితో కేసీఆర్ రాజకీయ ప్రభ తగ్గిపోయిందని ఏ ఒక్కరూ అనుకోవడం లేదు. ఆయన ప్రజల్ని పట్టించుకోకపోవడం వల్ల.. ఓ షాక్ ఇచ్చారని .. ఇది మామూలేనని అందరూ అనుకుంటున్నారు. కానీ.. ఎన్టీవీ మాత్రం.. ఏదో భారీ షాక్ తగిలిందని.. ఆయనను తక్కువ చూడవద్దని.. చెబుతున్నట్లుగా కథనం వండి వార్చారు. కేసీఆర్ ప్రసుత తరం నేతనే. ఆయన ఉద్యమాల గురించి.. పట్టుదల గురించి.. రాజకీయ వ్యూహాల గురించి.. తెలియని జనం ఎవరు ఉంటారు..? ఇప్పుడు ఆ విషయాలు చూపి పొగడాల్సిన అవసరం ఏముంది..?
కేసీఆర్ విషయంలో ఎన్టీవీ ప్రసారం చేసిన అరగంట బాకాను పూర్తిగా చూసిన వారికి.. మెచ్చాను… ఏం వరం కావాలో కోరుకో.. అని ప్రభువు కోరతాడేమో అని పొడిగినట్లుగా ఉందని సులువుగానే అర్థమవుతుంది. వ్యాపార ప్రయోజనాల కోసం.. ఇలా మీడియా చానళ్ల అధిపతులు.. ప్రత్యేకంగా కథనాలు రాయించుకోవడం సహజమే. కానీ అవి అప్పుడప్పుడూ మిస్ ఫైర్ అవుతూ ఉంటాయి. టైమింగ్ మిస్సయితే తేడా కొడతాయి. ఎన్టీవీ యజమానికి ఇప్పుడు.. ఈ కథనం.. ఏదైనా ప్రతిఫలం ఇస్తుందో.. రియాక్షన్ ఇస్తుందో… ఏ ఉద్దేశంతో రాయించారో.. దాని కోసం ప్రయత్నించినప్పుడే తేలుతుంది.