హైదరాబాద్: నారాయణఖేడ్ ఉపఎన్నికలో ప్రజలతీర్పును గౌరవిస్తామని తెలంగాణ అసెంబ్లీ టీ టీడీపీ ఫ్లోర్ లీడర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికలలో గెలుపోటములు సహజమని వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నో ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు రాలేదని చెప్పారు. ప్రస్తుతం ఆ పార్టీ అధికారంలో ఉండటంతో నారాయణఖేడ్ తీర్పు అనుకూలంగా వచ్చిందని అన్నారు. 2019 ఎన్నికల నాటికి కేసీఆర్ పాలనపై ప్రజలు స్పష్టమైన తీర్పు ఇస్తారని చెప్పారు. 2009 నుంచి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 72 ఎన్నికలు జరిగితే 90 శాతం నియోజకవర్గాలలో టీడీపీకి డిపాజిట్లు రాలేదని, అంతమాత్రాన టీడీపీ పని అయిపోలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం కేసీఆర్, కేటీఆర్, హరీష్ హవా సాగుతోందని, ప్రజలు వారికి అవకాశం ఇస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లోగా తెలంగాణలో తెలుగుదేశాన్ని పటిష్ఠం చేస్తామని చెప్పారు.
మరోవైపు తమ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే అరికెపూడి గాంధితో కలిసి రేవంత్ ఇవాళ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారిని కలిశారు. టీడీపీనుంచి టీఆర్ఎస్లోకి పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరారు. బడ్జెట్ సమావేశాలలోపే దీనిపై స్పీకర్ ఒక నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు రేవంత్ చెప్పారు. రేపు టీ టీడీపీ నేతలు విజయవాడ వెళ్ళి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కలిసి తెలంగాణలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ అంశాలపై చర్చించనున్నారు.