`లూసీఫర్`ని తెలుగులో రీమేక్ చేయాలని ఆశ పడ్డాడు చిరంజీవి. ఆ బాధ్యత ముందుగా… సుజిత్ కి అప్పగించాడు. ఆ తరవాత చేతులు మారి, వినాయక్ దగ్గరకు వెళ్లింది. ఇప్పుడు వినాయక్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు ఆ అవకాశం ఎవరికి వెళ్తుందో చూడాలి. అయితే ముందు నుంచీ ఈ రీమేక్‌పై వినాయక్ ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. తెలుగులో లూసీఫర్ వర్కవుట్ కాదన్నది వినాయక్ భావన. అందుకే…చిరుకి సున్నితంగా `నో` చెప్పాడు. కానీ చిరు బలవంతం చేయడంతో స్క్రిప్టు వర్క్ మొదలెట్టాడు. కానీ ఈ కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఎంత చేసినా.. సెకండాఫ్ ఓకే కాకపోవడం వల్లే, వినాయక్ ఈ ప్రాజెక్టు నుంచి బయటకు వెళ్లిపోయినట్టు సమాచారం.
అయితే.. చిరు, వినాయక్ కి ఓ మాటిచ్చాడట. `కొత్త కథ చేసుకురా.. అప్పుడు మనం కలిసి పనిచేద్దాం` అన్నాడట. వినాయక్ కూడా ఇప్పుడు చిరు కోసం కొత్త కథ రెడీ చేసే పనిలో ఉన్నాడని తెలుస్తోంది. లూసీఫర్ రీమేక్‌కి సరైన దర్శకుడు దొరికి, స్క్రిప్టు చిరు అనుకున్న రీతిలో వస్తే.. లూసీఫర్ రీమేక్ ఉంటుంది. లేని పక్షంలో ఇదే స్థానంలో వినాయక్ తో, కొత్త కథతో సినిమా మొదలవుతుందని చిరు కాంపౌండ్ వర్గాలు తెలిపాయి. లూసీఫర్ రీమేక్ హరీష్ శంకర్ చేతికి వెళ్లిందన్న వార్తలు వస్తున్నా.. అందులో స్పష్టత లేదు.