విశాఖలో గురి పెట్టినట్లుగా జరుగుతున్న ఘటనల్లో సబ్బం హరి, గీతం లాంటి పెద్ద పెద్ద ఘటనల తర్వాత.. ఇతర నేతలనూ ఆర్థికంగా దెబ్బకొట్టే టార్గెట్ సున్నితంగా కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా ఫ్యూజన్ ఫుడ్స్ అనే సంస్థకు చెందిన హోటల్‌ను అఘమేఘాలపై ఖాళీ చేయించేశారు. కారణం ఏమిటంటే.. అది వీఆర్ఎండీఏకు చెందిన స్థలంలో ఉంది. దాన్ని లీజుకు తీసుకున్నారు కానీ.. ఆ లీజు ఇచ్చిన పద్దతి సక్రమంగా లేదట. 2024 వరకూ లీజుకు తీసుకున్న పత్రాలు ఉన్నాయని యాజమాన్యం చెప్పినప్పటికీ వినకుండా అధికారులు మొత్తం సామాన్లు మొత్తం రోడ్డు మీద పడేసి.. హోటల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
హోటల్‌ను మూడేళ్లకు మాత్రమే లీజుకు ఇవ్వాలని.. ఆ తర్వాత కావాలంటే.. వేలం వేయాల్సి ఉందని అధికారులు నిబంధనలు చెబుతున్నారు. అయితే.. తమకు ప్రభుత్వం 2024 వరకూ ఇచ్చిన లీజు పత్రాలను యజమానులు చూపిస్తున్నారు. ఆ హోటల్ యజమాని టీడీపీ సానుభూతిపరుడు హర్షవర్ధన్దిగా చెబుతున్నారు. అయితే .. వైసీపీ నేతలు.. విశాఖను పంచుకున్నారని.. ఆ పంపకాల్లో భాగంగా.. వీఆర్ఎండీఏకు చెందిన స్థలాలను కూడా పంచుకున్నారని.. అందులో భాగంగానే.. ఆ స్థలాన్ని దక్కించుకున్న నేత ఇలా దౌర్జన్యంగా హోటల్‌ను ఖాళీ చేయించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
కోర్టుకు వెళ్లే సమయం కూడా ఇవ్వకుండా.. నోటీసులు ఇవ్వకుండా.. రాత్రికి రాత్రి ఇలా తొలగిస్తున్న ఘటనలు విశాఖలో వారానికి ఒక్కటయినా జరుగుతున్నాయి. తర్వాత కోర్టుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టే తెచ్చుకున్నా.. అప్పటికి జరగాల్సిన నష్టం జరుగుతోంది. టీడీపీ నేతల ఆర్థిక మూలాలు దెబ్బకొట్టాడనికి ప్రభుత్వం అధికారం దుర్వినియోగం చేస్తోందని.. అధికారులు పావులుగా మారుతున్నారని టీడీపీ నేతలు మండి పడుతున్నారు.