వారాంతం వస్తే విశాఖలో అధికారులు విరుచుకుపడుతున్నారు. బుల్డోజర్లు … ఇతర సామాగ్రిని పట్టుకుని లక్ష్యం వైపు దూసుకెళ్తున్నారు. నోటీసులు గట్రా ఏమీ లేకుండా.. కూల్చివేతలు… ఖాళీలు చేయిస్తూ… అందర్నీ ఆందోళనకు గురి చేస్తున్నారు. లీజు అక్రమం అంటూ… ఫ్యూజన్ ఫుడ్స్ హోటల్‌ను ఖాళీ చేయిస్తున్న సమయంలోనే అధికారులు… మాజీ మంత్రి గంటాకు చెందిన భూమిని కూడా.. స్వాధీనం చేసుకున్నారు. విజయరాంపురం అనే గ్రామంలో 4.8 ఎకరాల వ్యవసాయ భూమిని ప్రత్యూష అసోసియేట్స్ పేరిట కొనుగోలు చేశారు. గంటా భూమి కొనుగోలు చేసిన సర్వే నెంబర్లో ఇనామ్ భూమి ఉంది, దీంతో గంటా భూమి కూడా ఆక్రమణే అని.. హుటాహుటిన.. అక్కడ ఉన్న గేట్లు ఇతర పరికరాల్ని తొలగించేసి.. ప్రభుత్వ స్థలం అని బోర్డులు పెట్టారు.
గంటా శ్రీనివాసరావు రాజకీయాల్లోకి రాక ముుందే ఈ భూమిని కొనుగోలు చేశానని చెబుతున్నారు. అప్పట్లో ఎలాంటి వివాదాలు లేవని… ఇప్పుడు కొత్తగా వివాదాలు తెస్తున్నారని ఆయన అంటున్నారు. కోర్టుకెళ్లి కూడా ఉత్తర్వులు తెచ్చుకున్నానని ఆయన అంటున్నారు. బ్యాంకులు కూడా ఈ భూమిని తనఖా పెట్టుకుని రుణం ఇచ్చాయి. గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరుతారని కొద్ది కాలంగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. రెండు, మూడు సార్లు ముహుర్తం కూడా ఖరారైంది. కానీ ఆయన ఏ పార్టీలోనూ చేరలేదు. ఆయన రాకను మంత్రి అవంతి, విజయసాయిరెడ్డి అడ్డుకుంటున్నారని వైసీపీలో ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఆయన సజ్జల ద్వారా వైసీపీలో చేరడానికి రూట్ క్లియర్ చేసుకున్నారని కూడా అనుకున్నారు. ఈ కారణంగా టీడీపీ కూడా ఆయనకు ఎలాంటి పార్టీ పదవులు కల్పించలేదు.
ఆయనను పట్టించుకోవడం మానేశారు. గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడే గంటాకు చెందిన కొన్ని ఆస్తుల్ని కూల్చేస్తారని చెప్పుకున్నారు. రాత్రికి రాత్రి ఆయన స్టే తెచ్చుకుని కాపాడుకున్నారు. ఆ తర్వాత సైలెంటయ్యారు. మళ్లీ ఇప్పుడు ఆస్తుల స్వాధీనం అంటూ హడావుడి చేస్తున్నారు. ప్రస్తుత పరిణామాలు చూస్తూంటే.. గంటాను పార్టీలో చేర్చుకోకుండా…. చేయడంలో విజయసాయిరెడ్డి సఫలీకృతమయ్యారన్న చర్చ జరుగుతోంది.