తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేర్చుకున్న వారిని మెల్లగా సైడ్ చేసే ప్రక్రియను ఆ పార్టీ హైకమాండ్ ప్రారంభించినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఇలా పార్టీలో చేర్చుకున్న కొంత మంది నేతలను కనీసం పార్టీ కార్యక్రమాలకు కూడా పిలవడం లేదు. కొంత మందిని బలహీనం చేసే చర్యలను కూడా ప్రారంభించారని గుసగుసలు ప్రారంభించారు. ఇలాంటి సమయంలో.. మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుపై… పిల్లి సుభాష్ చంద్రబోస్ రాసిన ఓ లేఖ కలకలం రేపుతోంది. ఆయనపై ఉన్న శిరోముండనం కేసులో వేగం పెంచాలని.. తక్షణం చర్యలు తీసుకోవాలని ఆ లేఖ సారాశం.
తోట త్రిమూర్తులపై 23 ఏళ్ల కిందట ఓ శిరోముండనం కేసు నమోదయింది. దళితులకు శిరోముండనం చేయించిన కేసులో తోట త్రిమూర్తులు ఏ-వన్ నిందితుడుగా ఉన్నారు. ఆ కేసు విచారణ సాగుతూ ఉంది. గతంలో అధికార పార్టీలో ఉన్నప్పటికీ.. ఆయన కేసును ఎత్తి వేయించుకోలేకపోయారు. కొత్త ప్రభుత్వం… క్రిమినల్ కేసుల్ని కూడా అసువుగా ఎత్తేస్తూండటంతో.. తన కేసునూ ఎత్తేస్తారని అనుకున్నారేమో కానీ వైసీపీలో చేరిపోయారు. ఆయనను టీడీపీకి దూరం చేయాలన్న ఉద్దేశంతో రాజకీయంగా కూడా… ప్రాధాన్యత కల్పిస్తామని హైకమాండ్ హామీ ఇచ్చింది. పిల్లి సుభాష్ చంద్రబోస్.. ఇతర వైసీపీ నేతలతో ఉన్న విబేధాలను సర్దుబాటు చేసింది., అందరూ కలిసే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
అయితే హఠాత్తుగా పిల్లి సుభాష్ చంద్రబోస్.. హోంమంత్రి సుచరితకు.. 23 ఏళ్లుగా పెంండింగ్లో ఉన్న శిరోముండనం కేసులో గట్టి చర్యలు తీసుకోవాలని లేఖ రాయం కలకలం రేపుతోంది. పార్టీ పెద్దలకు ఇష్టం లేకుండా… పిల్లి సుభాష్ ఇలాంటి పని చేయరని.. గతంలో వారు చెబితేనే సర్దుకుపోయి పని చేసుకుంటున్నారని.. ఇప్పుడు వారికి తెలియకుండా లేఖ రాయరని అంటున్నారు. తోట త్రిమూర్తులు కేసుపై చర్యలు తీసుకుని దళితుల విషయంలో… తమ పార్టీ ఎవర్నీ ఉపేక్షించబోదని.. ప్రచారం చేసుకుంటార్న చర్చ కూడా నడుస్తోంది. ఇటీవలి కాలంలో దళితులపై జరుగుతున్న దాడుల వ్యవహారంలో ఏర్పడిన ఇమేజ్ డ్యామేజ్ను కంట్రోల్ చేసుకుంటారని అంటున్నారు. మొత్తానికి తోట త్రిమూర్తులకు మాత్రం..వైసీపీలో భవిష్యత్ లేదన్న చర్చ మాత్రం తూ.గో జిల్లాలో ప్రారంభమయింది.