చిరంజీవి అనగానే పసందైన పాటలు, వన్స్ మోర్ అనిపించే స్టెప్పులు. పాటలకు తన స్టెప్పులు జోడించి – వాటి ఖ్యాతి పెంచిన స్టార్.. మెగాస్టారే. చిరు సినిమా అంటే స్టెప్పులు లేకుండా ఎలా..? అందుకే సుదీర్ఘ విరామం తరవాత… చేసిన ‘ఖైదీ నెం.150’లోనూ చిరు స్టెప్పులు ఉండేలా జాగ్రత్త పడ్డాడు. ‘అమ్మడూ.. కుమ్ముడూ’, ‘సుందరి’ పాటల్లో సిగ్నేచర్ స్టెప్పులు ఒకప్పటి చిరంజీవిని గుర్తు చేశాయి. బెల్టు స్టెప్పు, బూటు స్టెప్పు అయితే.. ప్రతీ డాన్స్ ఈవెంట్లోనూ రిపీట్ గా ప్లే అయ్యేవి. అయితే ‘సైరా’లో చిరంజీవికి స్టెప్పులు వేసే అవకాశం రాలేదు. కథ కూడా ఆ ఛాన్స్ చిరుకి ఇవ్వలేదు.
మళ్లీ ఇప్పుడు ‘ఆచార్య’లో చిరు స్టెప్పుల మోత మోగిపోనున్నదని టాక్. నిజానికి కొరటాల శివ కథలు సెన్సిటీవ్ గా ఉంటాయి. అయితే… అందులో కమర్షియల్ అంశాలు పొందు పరచడం మాత్రం మర్చిపోడు. హీరో బలాబలాల్ని బేరీజు వేసుకునే సీన్లు రాసుకుంటాడు. చిరు కోసం కూడా కొరటాల అదే చేశాడట. రెండు మాస్ బీట్లకు సరిపడేలా సన్నివేశాల్ని రాసుకున్నాడని, దానికి మణిశర్మ మంచి బాణీలు సమకూర్చారని తెలుస్తోంది. త్వరలోనే చిరంజీవి డాన్స్ప్రాక్టీస్ మొదలెట్టబోతున్నాడట. జానీ, శేఖర్ లాంటి యంగ్ డాన్స్ డైరెక్టర్లు ఈ పాటల్ని కంపోజ్ చేయనున్నారని, ఇప్పటికే కొన్ని సిగ్నేచర్ స్టెప్స్‌ని చిరు కోసం కంపోజ్ చేశారని.. అవన్నీ `ఆచార్య`లో కనిపించడం ఖాయమని చెబుతున్నారు.