వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ప్రతీ విషయాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో ముడిపెడుతూ రాజకీయం చేయడం, విమర్శించడం ఒక అలవాటుగా మారిపోయినట్లుంది. సియాచిన్ లో మరణించిన సిపాయి ముస్తాక్ అహ్మద్ అంత్యక్రియలు కర్నూలు జిల్లాలో నంద్యాలలో జరిగాయి. ఆ కార్యక్రమానికి హాజరయిన జగన్మోహన్ రెడ్డి, తరువాత మీడియాతో మాట్లడుతూ చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు. దేశరక్షణ కోసం పనిచేస్తూ ఒక ముస్లిం సిపాయి మరణిస్తే చంద్రబాబు నాయుడు అతని కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా రాలేదని విమర్శించారు. సియాచిన్ లో మరణించిన సిపాయి హనుమంతప్ప కుటుంబానికి కర్నాటక ప్రభుత్వం రూ.25లక్షలు ఇచ్చిన తరువాతనే చంద్రబాబు నాయుడు స్పందించారని విమర్శించారు.
ఒక సైనికుడు ఏ మతానికి, ప్రాంతానికి చెందినవాడయినా దేశరక్షణ కోసం పనిచేస్తూ మరణిస్తే ఎవరికయినా బాధ కలిగిస్తుంది. చంద్రబాబు నాయుడు అందుకు అతీతుడేమీ కాదు. ముస్తాక్ అహ్మద్ అంత్యక్రియలకు ఆయన కానీ లేదా తన తరపున ప్రతినిధిగా మంత్రులను గానీ పంపి ఉంటే చాలా గౌరవంగా ఉండేది. ముస్తాక్ అహ్మద్ అంత్యక్రియలకు జగన్మోహన్ రెడ్డి వెళ్లడం హర్షించదగ్గదే. కానీ ఆ తరువాత ఆయన అక్కడ ఏమీ మాట్లాడకుండా నిశబ్దంగా వెనుతిరిగి వచ్చేసి ఉంటే ఇంకా గౌరవంగా ఉండేది. కానీ అలవాటు ప్రకారం జగన్ అక్కడ కూడా అనవసర రాజకీయాలు మాట్లాడి తన గౌరవాన్ని తనే మంట గలుపుకొన్నారు.
దేశ సేవలో మరణించిన సిపాయి ఏ మతానికి చెందిన వాడయినా అందరికీ గౌరవనీయుడే. కనుక మరణించిన ముస్తాక్ అహ్మద్ యొక్క మత ప్రస్తావన చేయడం సబబు కాదు. కానీ చేసారంటే ముస్లిం ప్రజలను ఆకట్టుకోవడానికేనని అనుమానించవలసి వస్తుంది. పరిహారం విషయంలో కర్నాటక ప్రభుత్వంతో ముడిపెట్టి చంద్రబాబు నాయుడుని విమర్శించడం కూడా చాలా అసందర్భంగా, అనుచితంగా ఉంది.
ముస్తాక్ అహ్మద్ కుటుంబానికి ఇంకా ఎక్కువ పరిహారం ఇస్తే బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లయితే అదే విషయాన్ని ఒక లేఖ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయవచ్చును లేదా ఇంకా ఆసక్తి ఉంటే స్వయంగా ముఖ్యమంత్రికి ఫోన్ చేసి మాట్లాడవచ్చును. కానీ ఆ పని చేయకుండా మీడియా ముందుకు వచ్చి విమర్శలు గుప్పించడం శవ రాజకీయం చేయడమే అవుతుంది. ఈ విధంగా జగన్ ప్రతీ అంశం, సమస్య నుండి కూడా రాజకీయ లబ్ది పొందాలనే తాపత్రయం ప్రదర్శించడం, ఏదో ఒక సాకుతో ముఖ్యమంత్రిని నిందించడం వలన ఆయనే చులకనవుతారని గ్రహిస్తే మంచిది.