ఓటీటీలో తొలి విజయాన్ని అందుకున్న సినిమాగా `ఆకాశం నీ హద్దురా` గుర్తిండిపోతుంది. ఓటీటీల పరాజయ పరంపరకు ఈ సినిమా బ్రేక్ వేసింది. మౌత్ టాక్ కూడా బాగా స్ప్రెడ్ అవ్వడంతో `ఈ సినిమా చూడాల్సిందే` అని సినీ అభిమానులు ఫిక్సవుతున్నారు. ఈ సినిమాతో అమేజాన్ కి సబ్ స్క్రెబర్ల తాకిడి కూడా పెరుగుతోంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో డిసెంబరు నుంచి థియేటర్లు తెరచుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కనీసం 50 శాతం ఆక్యుపెన్సీతో అనుమతులు రాబోతున్నాయి. డిసెంబరు మొదటి వారంలో థియేటర్లు తెరిస్తే.. అప్పటికి కొత్త సినిమాలు సిద్ధంగా ఉండకపోవొచ్చు. అందుకే ఇప్పటికే ఓటీటీలో విడుదలైన కొన్ని సినిమాల్ని థియేటర్లలో ప్రదర్శించాలని భావిస్తున్నారు. నిన్నా మొన్నటి వరకూ `వి,` `నిశ్శబ్దం`, `మిస్ ఇండియా`లాంటి సినిమాల్ని ప్రదర్శించాలని చూసినవాళ్లు ఇప్పుడు సూర్య సినిమాపై పడ్డారు.
సూర్య సినిమా తెలుగు రైట్స్ కోసం నిర్మాతలు గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఎలాగూ ఓటీటీలో విడుదలైపోయిన సినిమా కాబట్టి, తక్కువ రేటుకే ఈ సినిమా దొరకొచ్చన్నది బయ్యర్ల భావన. `ఆకాశం నీ హద్దురా` తో ఇక మీద ఎంత వచ్చినా అది నిర్మాత సూర్యకు బోనసే. అందుకే.. తెలుగు రైట్స్‌కి ఆయన ఇచ్చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగులో సూర్యకి మంచి మార్కెట్టే వుంది. దానికి తోడు ఈ సినిమా ఓటీటీలో హిట్టు. దానికి తోడు మోహన్ బాబు ఓ కీలక పాత్ర పోషించారు. మోహన్ బాబుది చిన్న సైజు పాత్రే అయినా, ఇది సూర్య – మోహన్ బాబుల సినిమా అని ప్రచారం చేసుకొనే ఛాన్స్ వుంది. అందుకే.. జనం సూర్య సినిమా చూడ్డానికి థియేటర్లకు వస్తారని నమ్మకం కలుగుతోంది. డిసెంబరులో థియేటర్లు ఓపెన్ అయితే.. ఎక్కువ థియేటర్లలో ఈ డబ్బింగ్ బొమ్మే కనిపించే ఛాన్స్ వుంది.