న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో ఉన్న కుట్రను వెలికి తీయాలంటూ.. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సీబీఐ కేసులు నమోదు చేసింది. అక్టోబర్ పదమూడో తేదీన ఈ మేరకు హైకోర్టు ఆదేశాలిచ్చింది. దాదాపుగా నెల రోజుల తర్వాత సీబీఐ కేసు రిజిస్టర్ చేసింది. విచారణ ప్రారంభించింది. ఏపీ హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నాయన్న కారణంగా కొంత మంది వరుసగా కోర్టులపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. కొంత మంది నరికేస్తామన్నట్లుగా పోస్టులు పెట్టారు. వైసీపీ నేతలు.. కోర్టులపై దారుణమైన నిందలు వేశారు. దీనిపై హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఫిర్యాదు చేసినా..సీఐడీ స్పందించలేదు.
కేవలం పన్నెండు కేసులు మాత్రమే నమోదు చేశారు. కానీ హైకోర్టు ఎంపీ, ఎమ్మెల్యేలతో సహా 93 మందికి నోటీసులు జారీ చేసింది. వారెవరిపైనా కేసులు పెట్టడం.. కానీ తదుపరి చర్యలు తీసుకోవడం కానీ చేయలేదు. ఈ విషయంలో ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీబీఐ విచారణ చేయాలని ఆదేశించింది. న్యాయమూర్తులను , కోర్టులను బెదిరించేందుకు.. ఓ ఆర్గనైజ్డ్ క్రైమ్ జరిగిందన్న అనుమానాలు మొదటి నుంచి విదేశాల్లో ఉన్న వారు కూడా.. ఈ వ్యవహారంలో ఉండటంతో.. అన్ని వనరులు కేంద్ర దర్యాప్తు సంస్థకు ఉంటాయని హైకోర్టు అభిప్రాయపడింది.
ఏపీ సీఐడీ మాత్రం 17మందిపై కేసులు నమోదు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ప్రస్తుతానికి ఈ కేసును సీబీఐ పరిశీలిస్తోంది. హైకోర్టు ఆదేశాల మేరకు.. గతంలో నోటీసులు జారీ చేసిన వారందరిపైనా విచారణ జరిగే అవకాశం ఉంది. ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్… అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాత మంత్రి పదవి పొందిన సీదిరి అప్పలరాజు వంటి వారు చిక్కుల్లో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.