కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిని .. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కామెడీ చేస్తున్నారు. ఆయన మంత్రిననే సంగతే మర్చిపోయినట్లున్నారని సెటైర్లు వేస్తున్నారు. కొద్ది రోజులుగా బీజేపీ నేతలు తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. రఘునందన్ రావు నేరుగా అమిత్ షాకు లేఖ రాశారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత బండి సంజయ్, కిషన్ రెడ్డి కూడా అవే ఆరోపణలు చేశారు. దీన్ని రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ – బీజేపీ కుమ్మక్కు రాజకీయాలకు సాక్ష్యంగా చూపిస్తున్నారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా .. ఫోన్ ట్యాపింగ్‌పై విచారణకు ఆదేశించే అధికారం కిషన్ రెడ్డికి ఉండగా.. ఇక్కడకు వచ్చి.. ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ప్రశ్నిస్తున్నారు. దీనికి బీజేపీ వద్ద సమాధానం ఉండకపోవచ్చు.
బీజేపీ నేతలు కేంద్రంలో అధికారంలో ఉన్నామని.. కేంద్ర పథకాలకు నిధులు తామే ఇస్తున్నామని ప్రచారం చేస్తున్నారు కానీ… తాము చేస్తున్న ఇతర రాజకీయ ఆరోపణలపై చర్యలు తీసుకునే అధికారం ఉన్నా స్పందించడం లేదు. తమ చేతుల్లో ఏదీ లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని మెల్లగా ప్రజల్లో చర్చ పెట్టడానికి కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఒక్క ఫోన్ ట్యాపింగ్ అంశమే కాదు.. వరద సాయం. కోసం నగదు పంపిణీ చేయడానికి వందల కోట్ల నగదు బ్యాంకులు ఎలా ఇచ్చాయన్నదానిపై రేవంత్ ప్రశ్నలు గుప్పిస్తున్నారు. కేంద్రంలో అధికార పార్టీగా బీజేపీ ఎందుకు దీనిపై చర్యలు తీసుకోలేదని విమర్శిస్తున్నారు.
కిషన్ రెడ్డి.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోవర్టని.. బీజేపీ అంతర్గత విషయాలు.. ఆయన ప్రగతి భవన్‌కు ప్రత్యేక దూత ద్వారా పంపుతూ ఉంటారని .. రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్, బీజేపీ.. కాంగ్రెస్‌ను దెబ్బకొట్టేందుకు.. ప్రత్యేకమైన వ్యూహం అమలు చేస్తున్నారన్న అభిప్రాయంతో కాంగ్రెస్ వర్గాలు ఉన్నాయి. పోటీ తమ మధ్యే ఉందని చెప్పుకునేలా దుబ్బాక తరహాలో గ్రేటర్ రాజకీయం చేయాలనుకుంటున్నట్లుగా కాంగ్రెస్ అనుమానిస్తుంది. ఇక్కడ అలాంటి పరిస్థితి లేదని నిరూపించేందుకు రేవంత్ ముందుగా రంగంలోకి దిగారు.