పల్లె కన్నీరు పెట్టే కష్టాలను ప్రపంచం ముందు పెట్టిన గోరటి వెంకన్న గొంతు ఇక మూగబోయినట్లే. ఎమ్మెల్సీ పదవి తీసుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడిన మాటలు చూస్తే.. ఆయన నోటి నుంచి కేసీఆర్ను కీర్తించే పాటలు వస్తాయని అనుకోక తప్పదు. పరిమితులకు లోబడి ప్రజా సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకు వెళతానని వినయంగా చెబుతున్నారు కానీ..వెంటనే సమస్యలేమీ లేనట్లుగా మాట్లాడేశారు. కవి కలం సమస్యలుంటే ఒకరకంగా, అభివృద్ధి పై మరో రకంగా స్పందిస్తుందని.. తెలంగాణ అరేళ్లలో చాలా అభివృద్ధి చెందిందని ప్రకటించారు. కొత్తగా ఏర్పడ్డ ఏడు రాష్ట్రాలకంటే చాలా ముందున్నామని.. ప్రాజెక్టులతో పంటపొలాల్లోకి నీరోస్తోందని.. ఇలాంటప్పుడు ఇంకా కన్నీటి పాటలు రాయలేనని ఆయన తేల్చేశారు.
మరి ప్రజలకు కష్టాలే లేవా.. అంటే… ప్రజల కష్టాలన్నీ ఒకే సారి తొలగిపోవని సూత్రీకరిస్తున్నారు. అభివృద్ధి జరగలేదు అనేవారి దృష్టికోణంలోనే లోపం ఉందని.. వి.హెచ్ లాంటి నేతలు తిని కూడా తినలేదు అనే రకమని చెప్పుకొచ్చారు. అలాంటి వారికి అభివృద్ధి కనిపించదనేశారు. ఇలా ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయగానే… వెంకన్న మాటలోనే తేడా వచ్చేసింది.. ఇక పాటలో రాకుండా ఉంటుందా.. అనే విస్మయం..కవులు, కళాకారుల్లో కనిపిస్తోంది.
తెలంగాణ ఉద్యమ సమయంలో… గోరటి వెంకన్న కూడా.. తనదైన పాత్ర పోషించారు. సమైక్య వాదుల వల్లనే తెలంగాణ ప్రజలకు కష్టాలని ప్రవచించారు. ఇప్పటికి ఆయనకు పదవి దక్కింది. అభివృద్ధి కనిపిస్తోది.కానీ.. ఇకా అభివృద్ధి చూడని కళాకారులు… తెలంగాణ ఉద్యమంలో గొంతెత్తిన కళాకారులు… కొన్ని వేల మంది ఉన్నారు. వారి కోసమైనా గోరటి వెంకన్న గొంతెత్తుతారో లేదో..?