తనపై అత్యంత అభిమానం చూపుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని బకరా చేశారు విశాఖ పీఠాధిపతి స్వరూపానంద. స్వరూపానంద జన్మదిన వేడుకులు.. ఆలయ మర్యాదులు పాటించాలంటూ… రాసిన లేఖను ఉపసంహరించుకుంటామని… ఆ పీఠం న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో రాజ గురువు అడిగారు కదా అని ముందూ వెనుకా చూసుకోకుండా.. ఉత్తర్వులు ఇచ్చేసి.. ఆనక మల్లాది విష్ణు లాంటి వారిని రంగంలోకి దింపి.., సమర్థింపులు కూడా చేసుకున్న ప్రభుత్వం పరువు ఇప్పుడు కోర్టు ముందు పోయినట్లయింది.
సరూపానంద ఈ నెల పద్దెనిమిదో తేదీన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా 23 దేవాలయాల నుంచి ఆలయ మర్యాదలు చేయాలని శారదా పీఠం మేనేజర్ ఈ నెల 9వ తేదిన రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపారు. ఇలా లేఖ రాయడం ఆలస్యం.. అలా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. దీనిపై కొంత మంది ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. సన్యాసులంటేనే మర్యాదలు, ఆడంబరాలకు దూరండా ఉండాలని, అటువంటి వారికి ఆలయ మర్యాదలు ఇవ్వడం ఏమిటని పిటిషనర్లు ప్రశ్నించారు. వాదనలు విన్న ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేస్తామని వ్యాఖ్యానించింది.
ప్రభుత్వం తరుపు న్యాయవాది జోక్యం చేసుకుని గతంలో కూడా ఇటువంటి ఉత్తర్వులు ఇచ్చామని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అయితే శారద పీఠం తరుపు న్యాయవాది తమకు కొంత సమయం కావాలని కోరారు. ఆ తరువాత ధర్మాసనం ముందుకు వచ్చి తాము ప్రభుత్వానికి రాసిన లేఖను ఉపసంహరించుకుంటున్నామని చెప్పారు. దీంతో కేసు విచారణను ధర్మాసనం ముగించింది. లేఖను ఉపసంహరించుకోవడంతో… లేఖ ఆధారంగా ఉత్తర్వులు ఇచ్చి సమర్థించుకున్న ప్రభుత్వం .. బకరా అయిపోయింది.