మొన్న మొన్ననే దుబ్బాక ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ ఇస్తూ దుబ్బాక ప్రజలు ఇచ్చిన తీర్పు తో టిఆర్ఎస్ పార్టీ జిహెచ్ఎంసి ఎన్నికల విషయంలో తటపటాయిస్తుందని, పైగా మొన్నటి వరదల కారణంగా పరువు పోగొట్టుకున్న టిఆర్ఎస్ ఇప్పుడిప్పుడే జిహెచ్ఎంసి ఎన్నికలు నిర్వహించదని భావించిన వారందరికీ షాక్ ఇస్తూ కేవలం 13 రోజుల వ్యవధిలో జిహెచ్ఎంసి ఎన్నికలకు ముందుకొచ్చారు కేసీఆర్. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చేసిన ఈ ప్రకటన అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఇందులో కేసీఆర్ రాజకీయ చాణక్యం, ద్వి ముఖ వ్యూహం ఇమిడి ఉన్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వివరాల్లోకి వెళితే..
మొదటి వ్యూహం:
దుబ్బాక ఎన్నికల లో విజయం సాధించడంతో బీజేపీ పార్టీ ప్రస్తుతం దూకుడు మీద ఉంది. ఆ పార్టీ తో పొత్తు ఉన్న జనసేన అధ్యక్షుడికి గ్రేటర్ పరిధిలో అభిమాన వర్గం కూడా బాగానే ఉంది. దీంతో గ్రేటర్ ఎన్నికల్లో కూడా సత్తా చూపించాలని బిజెపి జనసేన కూటమి ఉవ్విళ్లూరుతోంది. గత ఎన్నికల్లో ఐదు స్థానాలకు పరిమితమైన బిజెపి, ఈ సారి తన బలాన్ని పెంచుకోవడానికి ఉత్సుకతతో ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా హైదరాబాదులో సత్తా చాటుతామని వ్యాఖ్యలు చేస్తోంది. అయితే ఈ రెండు పార్టీలు వ్యాఖ్యలు చేయడం వరకు బాగానే ఉన్నప్పటికీ, నిజంగా ఎన్నికల కు అవసరమైన సంసిద్ధత విషయంలో వెనుకబడి ఉన్నాయి అన్నది బహిరంగ రహస్యం. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటిన టిఆర్ఎస్ కి సంసిద్ధత విషయంలో ఎటువంటి సమస్య లేదు. దీంతో ఇలా హఠాత్తుగా జిహెచ్ఎంసి ఎన్నికలు జరిపించడం ద్వారా ప్రతిపక్షాలను చావుదెబ్బ తీయవచ్చని, తద్వారా దుబ్బాకలో కోల్పోయిన పరువును గ్రేటర్ హైదరాబాద్ లో తిరిగి సంపాదించుకోవచ్చు అని కెసిఆర్ మొదటి వ్యూహంగా కనిపిస్తోంది అంటూ రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
రెండవ వ్యూహం:
అయితే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కు సంబంధించి కోర్టు లో పలు కేసులు విచారణలో ఉన్నాయి. ముఖ్యంగా, పాత రిజర్వేషన్లను కొనసాగిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం సరికాదని కోర్టులో వేసిన వ్యాజ్యంపై విచారణ కొనసాగుతూ ఉంది. కోర్టులో జరుగుతున్న ఈ కేసుల వెనకాల కొన్నింటిలో ప్రతిపక్షాల పాత్ర కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు కోర్టు ద్వారా ఎన్నికలు వాయిదా పడితే, ప్రతిపక్షాలు ఎన్నికలకు భయపడి వాయిదా వేయించాయి అని గట్టిగా ప్రచారం చేయించడం ద్వారా ప్రతిపక్షాల నోళ్ళు మూయించవచ్చు అన్నది కేసీఆర్ రెండవ వ్యూహంగా కనిపిస్తోంది.
దీనికి తోడు వరద కారణం గా నష్టపోయిన ప్రజలకు నేరుగా నగదు రూపంలో ఇటీవల టిఆర్ఎస్ ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది. అలాగే జీహెచ్ ఎం సీ ప్రాపర్టీ టాక్స్ విషయంలో 50 శాతం వరకు పన్ను మినహాయింపు ఇచ్చింది. డబ్బులు తీసుకున్న విషయం ప్రజలు మర్చిపోయే లోపే ఎన్నికలు నిర్వహించాలని కూడా ఒక వ్యూహం అయి ఉండవచ్చు అని విశ్లేషకుల అభిప్రాయం.
మరి ఈ వ్యూహాలు టిఆర్ఎస్ పార్టీకి విజయాన్ని అందిస్తాయా అన్నది వేచి చూడాలి.