గ్రేటర్ హైదరాబాద్ పీఠం టీఆర్ఎస్ను దాటిపోయే అవకాశం కనిపించడం లేదు. ఎన్నికల్లో టీఆర్ఎస్ అత్యంత హీన ప్రదర్శన చేసినా.. పీఠం మాత్ర ఆ పార్టీకే దక్కుతుంది. దానికి తగ్గట్లుగా నిబంధనలు ఉన్నాయి. గ్రేటర్ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలంటే… కార్పొరేటర్లు మాత్రమే ఓట్లేస్తే సరిపోదు. ఎక్స్ అఫీషియో ఓటర్లు కూడా… ఓట్లు వేయాలి. గ్రేటర్ పరిధిలోని లోక్సభ, రాజ్యసభ సభ్యులు, శాసనసభ, శాసన మండలి సభ్యులు జీహెచ్ఎంసీలో ఎక్స్అఫీషియో సభ్యులుగా ఉంటారు. గ్రేటర్ పరిధిలోని వారు కాకపోయినా.. తాము ఇక్కడే ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటామని పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఇలా మొత్తంగా టీఆర్ఎస్కు 35 మంది ఎక్స్ ఆఫీషియో ఓట్ల బలం ఉంది.
జీహెచ్ఎంసీలో మొత్తం 150 డివిజన్లు ఉన్నాయి. మేజిక్ ఫిగర్ 76 సీట్లు. అంటే ఎక్స్ ఆఫీషియో ఓట్లు కాకుండా.. 41 మంది కార్పొరేటర్లు గెలిస్తే పీఠం కారుకు. ఒక వేళ టీఆర్ఎస్ దారుణమైన పరాజయాన్ని ఎదుర్కొని.. పదో.. ఇరవయ్యే కార్పొరేటర్ సీట్లకు పరిమితమైనా విపక్షాలకు అవకాశమే లేదు. ఎందుకంటే… కేసీఆర్ మిత్రోం… అసదుద్దీన్ ఓవైసీ ఉన్నారు. ఏం చేసినా.. పాతబస్తీలో.. ముస్లిం ఓట్ల ప్రాబల్యం ఉన్న చోట్ల…ఎంఐఎంకు 40 నుంచి 50 కార్పొరేటర్ సీట్లు లభిస్తాయి. అలాగే ఆ పార్టీకి ఎక్స్ అఫీషియో ఓట్లు కూడా ఉన్నాయి.
వంద సీట్లు గెలుస్తామని కేటీఆర్ ధీమాగా చెబుతున్నారు కానీ… హుటాహుటిన ముగ్గుర్ని ఎమ్మెల్సీలుగా నియమించి.. వారిని హైదరాబాద్ పరిధిలోనే ఎక్స్ ఆఫీషియో ఓటర్లుగా నమోదు చేయించాలనే వ్యూహంతో … పరిస్థితి అంత తేలిగ్గా లేదని అర్థమవుతోందన్న అభిప్రాయం కలుగుతోంది. ఎలా చూసినా… మొత్తం 150 డివిజన్లలో.. ఎంఐఎం కాకుండా ఇతర పార్టీలన్నీ కలిసి.. 80..90 కార్పొరేటర్ సీట్లు గెలిచినా.. వారికి మేయర్ పీఠం దక్కదని మాత్రం.. ఇప్పటికే అందరికీ క్లారిటీ వచ్చేసింది.