గ్రేటర్ కాంగ్రెస్ పార్టీ ముందుగానే చేతులెత్తేసినట్లుగా కనిపిస్తోంది. సాధారణంగా ఎన్నికల నోటిఫికేషన్ వస్తే.. చిన్నా చితకా పార్టీల కార్యాలయాలు కూడా పెద్ద ఎత్తున కిటకిటలాడుతూ ఉంటాయి. టిక్కెట్.. టిక్కెట్ అంటూ అరుపులూ వినిపిస్తూ ఉంటాయి. టీడీపీలోనూ.. ఆశావహుల సందడి కనిపిస్తోంది కానీ.. గాంధీ భవన్ మాత్రం కార్యకర్తల జాడే లేదు. నేతలు కూడా ఎవరూ రావడం లేదు. మరో వైపు.. డివిజన్లలో బలమైన నేతలందర్నీ బీజేపీ రాసుకుని మరీ .. పిలిచి టిక్కెట్లిస్తోంది. రకరకాల సమీకరణాలు.. ఆర్థిక మద్దతు ఆశ చూపి.. వారిని కాంగ్రెస్ తరపున కాకుండా.. తమ పార్టీ తరపున పోటీ చేసేలా చేసుకుంటోంది. బండ కార్తీక రెడ్డి, భిక్షపతియాదవ్ వంటి నేతలు ఇప్పటికే గులాబీ గూటికి చేరారు.
కాంగ్రెస్‌లో బహుళ నాయకత్వం ఆ పార్టీని చీలికలు పేలికలు చేసింది. సీనియర్లుగా చెప్పుకునే వీహెచ్ లాంటి నేతలు.. ఎలాంటి కార్యక్రమాన్ని అయినా పార్టీలో రసాభాస చేసి.. కాంగ్రెస్ అంటే అంతే అనిపించేలా చేస్తారు. చివరికి వీహెచ్ కూడా.. ఇప్పుడు గాంధీభవన్ ముఖం చూడటం లేదు. తన నియోజకవర్గంలో టిక్కెట్ల పంపిణీ చేయాలనే ఆలోచన కూడా చేయడం లేదు. రేవంత్ రెడ్డి మాత్రం… పార్టీ నుంచి వెళ్లిపోయేవారిని ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అది రేవంత్‌కు శక్తికి మించిన పనైపోతుంది.
ఉత్తమ్ కుమార్ రెడ్డి శల్య సారధ్యం.. కాంగ్రెస్ పార్టీని రోజు రోజుకు చిక్కిపోయేలా చేస్తోందని ఆ పార్టీ నేతలు ఉసూరుమంటున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా.. ఓ బలమైన నేతకు.. పార్టీ పగ్గాలిస్తే.. క్యాడర్లోన కదలిక వస్తుందని.. అంచనా వేయడం లేదని.. పార్టీకి గాలికొదిలేసిందని ఆవేదన చెందుతున్నారు. గ్రేటర్లో ఎంతో కొంత క్యాడర్ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు.. బ్యాటన్‌ను.. బీజేపీకి వదిలేసే పరిస్థితి వచ్చిందన్న అభిప్రాయం మాత్రం ఏర్పడుతోంది.