జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఎప్పుడో ఒక సారి అమరావతి రైతులకు మద్దతు ప్రకటిస్తున్నారు. వారు వచ్చిన కలిసినప్పుడో.. లేకపోతే తాను అమరావతి వెళ్లినప్పుడో ఆ ప్రకటనలు చేస్తున్నారు తప్ప.. వారికి మద్దతుగా ఉద్యమంలోకి వచ్చే ప్రయత్నం చేయడం లేదు. కీలకమైన సందర్భాల్లో మాట సాయం కూడా ఉండటం లేదు. బీజేపీతో పొత్తు పెట్టుకోక ముందు మార్చ్ అని.. మరొకటని ప్రకటించారు. కానీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత పరిస్థితి మారిపోయింది. అందుకే.. బీజేపీతో కలిసి రైతుల్ని మోసం చేస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆయన చేసిన ప్రకటన కూడా అలానే వివాదాస్పదం అవుతోంది.
రాజధాని తరలిస్తున్నామని ప్రభుత్వం ఆన్రికార్డ్గా చెప్పలేదని పవన్ చెప్పుకొస్తున్నారు. అధికారికంగా చెప్పిన తర్వాత జనసేన కార్యచరణ ఉంటుందని రైతులకు తెలిపారు. ఆన్ రికార్డ్ .. అధికారికం అంటే ఏంటో పవన్ కల్యాణ్ కు తెలియదమో అన్న సెటైర్లు పడుతున్నాయి. ఇప్పటికే బిల్లులు ఆమోదించేసుకున్నారు . గవర్నర్ కూడా సంతకం పెట్టేశారు. అది ఆన్ రికార్డ్ కాదా అనే సందేహం.. పవన్ మాటలు విన్నవారికి వచ్చింది. రైతులు న్యాయపోరాటం చేస్తున్నారు.. ఏ మాత్రం సందు దొరికినా… రాజధానిని తరలించాలని పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. అయినా పన్ కల్యాణ్… అధికారికంగా చెప్పలేదని..చెప్పిన తర్వాత కార్యాచరణ ఖారారు చేసుకుంటానంటున్నారు.
అయితే తనను కలిసిన రైతులకు మాత్రం.. తనదైన శైలిలో ధైర్యం చెబుతున్నారు. రైతులకు వైసీపీ నేతలు చేస్తున్న విమర్శల్ని ఖండించారు. బంగారం పెట్టుకొని ఉద్యమం చేయకూడదా?…ఉద్యమం అంటే చిరిగిన బట్టలు వేసుకొనే ఉండాలా? అని ప్రశ్నించారు. అమరావతి రైతులకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని.. రాజధానిగా అమరావతే ఉంటుందని బీజేపీ స్పష్టం చేసిందని వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.