దుబ్బాక ఉప ఎన్నిక రాజకీయ పరంగా చర్చకు దారి తీసింది. అధికార టీఆర్ఎస్ పార్టీకి జలక్ ఇచ్చిన మొనగాడు గా బండి సంజయ్ పేరు సోషల్ మీడియా లో మారు మోగిపోయింది. అయితే హటాత్తుగా నిన్నటి నుండి, అదే సోషల్ మీడియాలో బండి సంజయ్ కి విజయం తలకెక్కింది అంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
“Nothing fails like a success” అని ఒక నానుడి. విజయం సాధించడం కష్టమైన సంగతే అయినా, దానికంటే కష్టమైన సంగతి సాధించిన ఆ విజయాన్ని నిలబెట్టుకోవడం. విజయం సాధించడం వరకు చాలా మంది చేయగలుగుతారు కానీ దాన్ని నిలబెట్టుకుని కొనసాగించగలిగే వాళ్ళు కొందరే ఉంటారు. రాజకీయాల్లో ఇది మరీ కష్టం. నిన్న మొన్నటి వరకు ఒక్క ఛానల్ కూడా మద్దతు ఇవ్వకపోయినా బండి సంజయ్ లాంటి నేతలు చేసే వ్యాఖ్యలు ప్రజల్లోకి బలంగా వెళ్లగలిగాయి అంటే దానికి కారణం సోషల్ మీడియాలో బండి సంజయ్ కి ఉన్న ఫాలోయింగ్.
అయితే జిహెచ్ఎంసి ఎన్నికల సందర్భంగా ఆయన తమకు ఏ పార్టీతో పొత్తు ఉండదని అంటూ చేసిన వ్యాఖ్యలు పలువురికి ఆశ్చర్యం కలిగించాయి. బీజేపీ జనసేన పొత్తు లో భాగంగా ముందుకు కొనసాగుతున్నాయని ఆ పార్టీ జాతీయ నాయకత్వం చెబుతూ ఉంటే, బండి సంజయ్ పవన్ కళ్యాణ్ కి దాదాపుగా షాక్ ఇస్తున్నట్లుగా ప్రకటన చేశారు. పైగా తమను ఎవరూ సంప్రదించలేదని వ్యాఖ్యలు చేశారు. దీంతో సోషల్ మీడియాలో జనసేన అభిమానులు ఒకసారి బండి సంజయ్ పై యు టర్న్ తీసుకున్నారు. ఒకే ఒక ఉప ఎన్నికల్లో అది కూడా ముక్కి ముక్కి కేవలం వెయ్యి ఓట్లతో విజయం సాధించిన బండి సంజయ్ ఆ విజయాన్ని తలకు ఎక్కించుకున్నాడని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదే నెటిజన్లు దుబ్బాక ఎన్నికల సమయంలో బండి సంజయ్ వ్యాఖ్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ను విపరీతంగా వినియోగించిన సంగతి తెలిసిందే. వీరిలో కొందరు, జనసేన బరి లో లేకపోతే బిజెపికి వేయడం కంటే అధికార టీఆర్ఎస్ పార్టీకి వేయడం మేలు అంటూ సోషల్ మీడియాలో హింట్స్ కూడా ఇస్తున్నారు.
ఇక జనసేన అభిమానులే కాకుండా, ఇతరులు కూడా, టిఆర్ఎస్ పార్టీ అన్ని ఉప ఎన్నికల్లో అన్ని సార్లు గెలిచినా కూడా ఎప్పుడు ఇంతలా విర్రవీగ లేదని, బండి సంజయ్ లాంటి బీజేపీ నేతలు కేవలం ఒకే ఒక్క ఉప ఎన్నిక గెలవగానే విజయాన్ని తలకెక్కించుకుంటున్నారని, వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి దుబ్బాక ఈవీఎంలలో సత్తా చూపించిన బిజెపి జిహెచ్ఎంసి బ్యాలెట్ బాక్సుల లో ఏ మేరకు విజయం సాధిస్తుంది అన్నది వేచిచూడాలి.