ఈతరం దర్శకులంతా చాలా నిదానంగా వ్యవహరిస్తున్నారు. సినిమా సినిమాకి మధ్య గ్యాప్ వచ్చినా, పెద్దగా భయపడడం లేదు. అయితే… క్రిష్ మాత్రం ఓ సినిమా సెట్స్ పై ఉండగానే, మరో సినిమాని మొదలెట్టేశాడు. ఇలా దర్శకులు చక చక సినిమాలు తీయడం పరిశ్రమకు మంచిదే. కాకపోతే… ఈ విషయంలో పవన్ మాత్రం క్రిష్ పై కాస్త కినుక చూపిస్తున్నట్టు టాక్.
పవన్ కల్యాణ్ – క్రిష్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. `వీరూపాక్ష` అనే టైటిల్ పరిశీలనలో వుంది. లాక్ డౌన్ వల్ల.. షూటింగ్ ఆగిపోయింది. అయితే.. ఈ గ్యాప్ లో క్రిష్ మరో సినిమాని పట్టాలెక్కించేశాడు. `కొండపొలెం` నవలని సినిమాగా తీస్తున్నాడు. వైష్ణవ్ తేజ్, రకుల్ జంటగా నటిస్తున్నారు.
`విరూపాక్ష` సెట్స్‌పై వుంది. కాకపోతే కాస్త గ్యాప్ వచ్చింది. అలాంటి విరామంలో స్క్రిప్టుపై మరింత శ్రద్ధ చూపించాలి. సన్నివేశాలు మరింత బాగా రావడానికి కసరత్తులు చేయాలి. కానీ `విరూపాక్ష` వదిలేసి, మరో సినిమా పనిలో పడిపోవడం పవన్ కి నచ్చలేదని తెలుస్తోంది. ఈమధ్య కాలంలో ఏ దర్శకుడూ ఇలా ఓ సినిమా వదిలేసి, మరో సినిమాని మొదలెట్టలేదు. ఇది స్టార్ హీరో సినిమా. పైగా చారిత్రక కథ. గ్రౌండ్ వర్క్ చాలా చేయాల్సివుంటుంది. ఆ అవకాశం వచ్చినా క్రిష్ వాడుకోలేదు. రేపు ఈ సినిమా ఫలితం కాస్త అటూ ఇటూ అయితే ఒకేసారి రెండు సినిమాలన్న పాయింటే జనం ఎత్తి చూపుతారు. అప్పుడు క్రిష్ ఇంకెన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుందో. నిజానికి పవన్ అనుమతి తీసుకునే క్రిష్ వైష్ణవ్ తేజ్ సినిమా మొదలెట్టాడు. తన మేనల్లుడి సినిమా కావడం, పైగా షూటింగు గ్యాప్ రావడంతో పవన్ కాదనలేకపోయాడు.