ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ప్రభుత్వం నుంచి తనకు ఎంత మాత్రం సహకారం లభించడం లేదనే విషయాన్ని .. పక్కా నిరూపించేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా..? అదే సమయంలో.. తనకు వ్యతిరేకంగా ప్రభుత్వంలో భాగంగా ఉన్న వారు చేస్తున్న వ్యాఖ్యలతో.. ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తుందన్న అంశాన్ని… నిరూపించేందుకు ఉపయోగించుకుంటున్నారా..? అంటే అవునననే సమాధానాలు వస్తున్నాయి. ప్రభుత్వం ఎంత మాత్రం సహకరించదని తెలిసి కూడా ఆయన వరుసగా రెండు రోజుల పాటు.. కలెక్టర్లు.. ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ కోసం సీఎస్‌కు లేఖ రాశారు. సీఎస్ తిరుగుటపాలో ఎన్నికలు నిర్వహిచడానికి సిద్ధంగా లేమని లేఖ పంపారు. ఇదే వివాదాస్పదమయింది. ఎన్నికల కమిషన్ విధుల్లో జోక్యం చేసుకోవడమేనన్న చర్చ రాజ్యాంగ నిపుణుల్లో వ్యక్తమవుతోంది.
అయితే నిమ్మగడ్డ వరుసగా రెండో రోజు కూడా.. వీడియో కాన్ఫరెన్స్ కోసం లేఖ రాశారు. కానీ సీఎస్ నుంచి కలెక్టర్లు ఇతర ఉన్నతాధికారులకు అనుమతి రాలేదు. దాంతో రెండో సారి కూడా వీడియో కాన్ఫరెన్స్ రద్దయింది. అది జరగదని… నిమ్మగడ్డకు తెలుసు. కానీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సహకరించడం లేదనే దానికి పక్కాగా సాక్ష్యాలు కావాలన్నట్లుగా నిమ్మగడ్డ.. ముందుకెళ్తున్నారు. అదే సమయంలో.. ప్రభుత్వంలో మంత్రులు తనపై ప్రయోగిస్తున్న భాష.. బెదిరింపుల అంశాన్ని ఆయన పక్కాగా నోట్ చేసుకుంటున్నారు. ముందుజాగ్రత్తగా.. గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. మంత్రి కొడాలి నాని.. నిమ్మగడ్డపై చేసిన అభ్యంతర వ్యాఖ్యలను… నిమ్మగడ్డ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఫిర్యాదు చేశారు. అయితే.. గవర్నర్ ఎలాంటి చర్యలు తీసుకోరని ఆయనకు తెలుసు. కానీ పద్దతి ప్రకారం ఆయన వెళ్తున్నారన్న అభిప్రాయం ఏర్పడుతోంది.
ఎన్నికల కమిషన్ పనితీరులో జోక్యం చేసుకోవడం అంటే.. ప్రజాస్వామ్య పునాదుల్ని బలహీనం చేయడమే. రాజ్యాంగంలో ఎన్నికల కమిషన్‌కు సర్వాధికారాలు ఉన్నాయి. ఈ విషయంలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. రేపు ఏపీ సర్కార్ తీరును చూపి.. కేంద్రంలో ప్రభుత్వం కూడా.. ఐదేళ్ల తర్వాత ఎన్నికలు పెట్టకుండా… ఎన్నికల కమిషన్ ను నియంత్రిస్తే రాజ్యాంగానే అర్థం లేకుండా పోతుంది. అందుకే కాస్త ఆలస్యమైనా… ఎన్నికల కమిషన్ విషయంలో ఏపీ సర్కార్ తీరు.. ఖచ్చితంగా తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. అందుకే.. నిమ్మగడ్డ… వ్యూహాత్మకంగా… ప్రతీ విషయంలోనూ తప్పు ప్రభుత్వం వైపే ఉందనేలా.. సాక్ష్యాలు రెడీ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. నిమ్మగడ్డ వ్యవహారంలో ప్రభుత్వం దూకుడుగా వెళ్తోంది.. ముందూ వెనుకా చూసుకోవడం లేదు.. దాన్నే నిమ్మగడ్డ అనుకూలంగా మార్చుకునే పరిస్థితి ఏర్పడుతున్నాయని భావిస్తున్నారు .