అవినీతి ఆరోపణలు ఉన్నాయని పదవి చేపట్టిన మూడు రోజులకే బీహార్ మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. బిహార్ విద్యాశాఖ మంత్రి మేవాలాల్ చౌదరి తన పదవికి రాజీనామా చేశారు. మూడు రోజుల కిందట బిహార్‌లో కొత్త ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జేడీయూ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన మేవాలాల్ చౌదరికి విద్యా శాఖను కేటాయించారు. అయితే.. ఆయనపై గతంలో తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మేవాలాల్.. గతంలో ఓ యూనివర్శిటీకి వీసీగా పని చేశారు. ఆ సమయంలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. లంచం తీసుకుని అర్హతలేని వారికి యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, జూనియర్ శాస్త్రవేత్తలుగా నియమించారనే ఆరోపణలపై విచారణ కూడా జరుగుతోంది. దీనిపై విపక్షాలు మండిపడ్డాయి. నేరమయమైన కేబినెట్‌ను ఏర్పాటు చేశారని విమర్శలు గుప్పించడం ప్రారంభించారు.
అదే సమయంలో… ఓ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన మేవాలాల్ జాతీయ గీతం తప్పుగా ఆలపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో ఆయన పదవికి రాజీనామా చేయాలని సీఎం నితీష్ కోరారు. ఆయన పదవి నుంచి వైదొలిగారు. బీహార్ అంటే.. నిన్నామొన్నటిదాకా నేరమయ రాజకీయ నేతలకు పెట్టింది పేరు. కానీ ఇప్పుడు.. అవినీతి ఆరోపణలు ఉన్న వారు నైతిక బాధ్యతగా.. రాజీనామాలు కూడా చేస్తున్నారు. అలాంటి వారు కేబినెట్లో ఉన్నందుకు ముఖ్యమంత్రులు కూడా సిగ్గుపడుతున్నారు. విమర్శలు వచ్చిన తర్వాతైనా వారిని తొలగించడానికి వెనుకాడటం లేదు.
కానీ.. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో అవినీతి ఆరోపణలు కాదు.. వేల కోట్లకు సంబంధించి సీబీఐ ఈడీ కేసుల దగ్గర్నుంచి పేకాట క్లబ్‌లు.. ఈఎస్ఐ స్కాంలో నిందితుల నుంచి గిఫ్టులుగా లంచాలు తీసుకున్న వారి వరకూ చాలా మంది ఉన్నారు. కానీ.. ఎవరూ కూడా.. నైతిక బాధ్యత తీసుకోవడం లేదు. అవినీతి ఆరోపణలు రావడాన్ని గొప్పగా భావించే పరిస్థితి వచ్చేసింది. కానీ బీహార్ మాత్రం మారుతోంది.