ఎన్నికల్లో గెలవడానికి రాజకీయ నాయకులు ఆల్ ఫ్రీ హామీలు ఇస్తూంటారు. ఇప్పుడు.. వాటిలో మరో రేంజ్ సెట్ చేస్తున్నారు… తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే.. ఆయన చలాన్లు రద్దు చేస్తారట. ఏం చలాన్లు అనుకున్నారు.. బండి చలాన్లు. హెల్మెట్ పెట్టుకోలేదని… ట్రిపుల్ రైడింగ్ చేశారని.. లైసెన్స్ లేదని ఇలా రకరకాల కారణాలతో.. ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేసి మరీ.. చలాన్లు వేస్తూంటారు. వారికి టార్గెట్ కూడా ఉంటుంది. ఈ చలాన్లను రద్దు చేస్తే.. వాటి బాధితులందరూ ఓటు బ్యాంక్‌గా మారిపోతారని.. బండి సంజయ్ గొప్ప ప్లానేశారు. వెంటనే మీడియా సమావేశంలో ప్రకటించేశారు. అసలు.. అన్నన్ని చలాన్లు వసూలు చేస్తే ప్రజలు ఎలా బతకాలని ఆయన ఆవేదన.
అయితే.. చలాన్లు రద్దు చేయడం అనేది… గ్రేటర్ హైదరాబాద్ కార్పొరే్షన్ పరిధిలో ఉండదు. అందుకేనేమో.. నమ్మరనుకున్నారేమో కానీ.. మొత్తం కట్టేస్తామని హామీ ఇచ్చారు. గ్రేటర్ ప్రజలు పన్నులుగా కట్టిన సొమ్మును.. చలాన్లకు కట్టేస్తానని ఆయన చెబుతున్నారు. చలాన్లు ఎన్ని వేసినప్పటికీ.. అక్రమంగా వేసినవి అయితే కాదు. ట్రాఫిక్ పోలీసులు చలాన్ వేశారంటే.. దానికి సాక్ష్యంగా ఫోటో కూడా పెడతారు. అయినా చలాన్లను రద్దు చేస్తామని.. తామే కడతామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. అసలు ఇలాంటి హామీ కూడా ఇవ్వవచ్చనే ఆలోచన బండి సంజయ్‌కు ఎలా వచ్చిందో కానీ.. సోషల్ మీడియాలో ఒకటే ట్రోలింగ్. అసలు చలాన్ ఎందుకు వేస్తారో.. ఎవరు వేస్తారో.. తెలుసుకోవాలంటూ.. బండి సంజయ్‌పై సెటైర్లు వేస్తున్నారు.
గ్రేటర్లో బీజేపీ గెలుపు కోసం బండి సంజయ్.. చలాన్ కట్టేయడం లాంటి హిలేరియస్ హామీనే కాదు… వరదల్లో నష్టపోయిన ప్రతీ ఒక్కరికీ సాయం.. అంటే త్రివిక్రమ్ డైలాగ్‌లో చెప్పినట్లుగా.. అందరూ డబ్బులే నష్టపోయి ఉండరు… కార్లు నష్టపోయిన వారికి కార్లు… బైుకులు నష్టపోయిన వారికి బైకులు కూడా ఇచ్చేస్తారట.. సంజయ్. మొత్తానికి బీజేపీ.. దుబ్బాకలో గెలిచిన ఊపులో.. గ్రేటర్లో అద్భుతం చేయాలనుకుని… నమ్మశక్యం కానీ హామీలిచ్చేస్తోంది. ఈ విషయంలో బండి సంజయ్ ఎవరేమనుకున్నా డోంట్ కేర్ అంటున్నారు.