మధ్యతరగతి కుటుంబాల్లోకి తొంగి చూస్తే ఎన్నో కథలు దొరికేస్తాయి.
ఆశలు, అలకలు
ఆంక్షలు, ఆకాంక్షలు
కన్నీళ్లు, కష్టాలూ
చిన్న చిన్న ఆనందాలూ, చెదిరిపోని విషాదాలు ఎన్నో కనిపిస్తాయి. పైగా నూటికి తొంభై మంది జాతి.. మధ్యతరగతి. అందుకే అక్కడి నుంచి ఏ కథ మొదలైనా, మనసును హత్తుకునే పాయింటేదో కనిపిస్తుందన్న భరోసా కలుగుతుంది. `మిడిల్ క్లాస్ మెలోడీస్`.. ఈ పేరుతోనే ఇది మధ్యతరగతి కథ అన్న సంగతి అర్థమైపోతుంది. మరి… ఈ మధ్యతరగతి మహాభారతం – ఏ పర్వాన్ని సృశించింది?
గుంటూరు దగ్గర కొలకలూరు గ్రామం అది. కొండలరావుది చిన్న కాఫీ హోటెల్. అక్కడ బొంబాయి చెట్నీ మంచి ఫేమస్. అది చేసేది కొండలరావు అబ్బాయి… రాఘవనే. ఇంటర్ వరకూ చదివాడు. గుంటూరులో ఓ మంచి కాఫీ హోటెల్ పెట్టాలని, తన బొంబాయి చెట్నీ రుచి గుంటూరు వాసులకు చూపించాలని కలలు కంటుంటాడు. తన మరదలు సంధ్య అంటే తనకు చాలా ఇష్టం. సంధ్యకు కూడా అంతే. కానీ గుంటూరులో హోటెల్ పెట్టడం కొండలరావుకి ఇష్టం ఉండదు. పైగా… తాను కష్టపడి సంపాదించిన చీటీ డబ్బులతో ఓ పెద్దాయన పరారవుతాడు. ఇలాంటి పరిస్థితుల్లో రాఘవ గుంటూరులో హోటెల్ పెట్టాడా? అక్కడ నిలదొక్కుకున్నాడా? తన మరదల్ని పెళ్లి చేసుకున్నాడా? అన్నదే మిగిలిన కథ.
టైటిల్‌కి తగ్గట్టు మిడిల్ క్లాస్ జీవితాల చుట్టూ సాగే కథ ఇది. ఇది రాఘవ ఒక్కడి కథ కాదు. జాతకాల పిచ్చితో ప్రేమించిన అమ్మాయిన దూరం చేసుకున్న గోపాల్ కథ కూడా. వీళ్లతో పాటు మరికొన్ని మిడిల్ క్లాస్ , లోయర్ మిడిల్ క్లాస్ జీవితాలు తెరపై కనిపిస్తాయి. ఈ కథలన్నింటినీ దర్శకుడు ఏ తీరాలకు చేర్చాడన్నదే ఆసక్తికరం. సినిమాలోని పాత్రలెక్కువే. అయితే అవన్నీ అత్యంత సహజంగా ప్రవర్తిస్తాయి. నిజంగా ఓ మధ్యతరగతి కుటుంబంలో కెమెరా పెట్టి, అక్కడ పాత్రల ప్రవర్తనని మనకు చూపిస్తున్నట్టు.. సాగుతుంటాయి సన్నివేశాలు. పాత్రలు మాట్లాడుకునే మాటలు, ఆ ఇళ్లూ, అక్కడి వాతావరణం, జీవితాలు… వీటన్నింటినీ దర్శకుడు సరిగానే పోట్రైట్ చేయగలిగాడు.
కథ సహజంగా చెప్పాలనుకోవడం తప్పులేదు. సన్నివేశాలకు అది ప్రాణం పోస్తుంది. ప్రేక్షకుల్ని కథలో మరింత ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేట్టు చేస్తాయి. అయితే ఆ సహజత్వం చాదస్తంగా మారకూడదు. ప్రతీ సన్నివేశాన్ని విడమరచి చెప్పాలనుకునే ప్రయత్నంలో అనవసరమైన విషయాల్ని ఎక్కువ చెప్పేస్తుంటారు. ఈ సినిమా విషయంలోనూ అదే జరిగింది. ప్రారంభంలోనే ఓ గృహ ప్రవేశ సన్నివేశం. అది హీరో ఇల్లో, హీరోయిన్ ఇల్లో అనుకుంటారు. కానీ… హీరో టిఫిన్ సప్లై చేసే ఇల్లు. అక్కడి సన్నివేశాన్ని ఎంత డిటైల్డ్ గా తీస్తాడంటే.. కొత్తింట్లో ఆవు పేడ వేసే సన్నివేశంతో సహా దేన్నీ వదిలిపెట్టడు. అంత డిటైలింగ్ అనవసరం. ఈ పద్ధతి సినిమాలో చాలా చోట్ల కనిపిస్తుంటుంది. చీటీల డబ్బుతో పరారయ్యే ఓ పెద్దాయన పాత్రకీ అంతే అనవసరమైన ప్రాధాన్యం ఇచ్చారు. గుంటూరు వెళ్లి హోటెల్ పెట్టాలన్నది కథానాయకుడి ధ్యేయం. దాన్ని ఇంట్రవెల్ వరకూ.. పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాడు. బొంబాయి చెట్నీతో ఫేమస్ అయిపోవాలన్న పాయింట్ తో చివరి వరకూ లాగారు. సినిమా సాగుతున్న కొద్దీ, దర్శకుడు పట్టు కోల్పోతూ వచ్చాడు. క్లైమాక్స్ లోతరుణ్ భాస్కర్నిరంగంలోకి దించినా ఫలితం లేకపోయింది. ఎంటర్టైన్గా చెప్పాల్సిన విషయాల్ని కూడా సీరియస్ కోణంలో చెప్పడం, సాగదీత, ఏ ఎమోషన్ నీ సరిగా పలికించకపోవడంతో… మిడిల్ క్లాస్ కథ… `మిడిల్` రేంజులోనే ఉడికింది.
ఆనంద్ దేవరకొండకు ఇది రెండో సినిమా. తన వరకూ చాలా సహజంగా చేశాడు. నిజంగా ఓ మిడిల్ క్లాస్ అబ్బాయిని తెరపై చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ పాత్రనే కాదు. అన్ని పాత్రల్నీ అంతే జాగ్రత్తగా తీర్చిదిద్దాడు. వాళ్ల మాటలు, ప్రవర్తన సహజంగా ఉంటాయి. ముఖ్యంగా హీరో తండ్రి పాత్ర ఆకట్టుకుంటుంది. గోపరాజు రమణ.. అత్యంత సహజమైన రీతిలో నటించారు. వర్ష బొల్లమ్మ.. క్యూట్ గా కనిపించింది. ఆమె అమాయకపు మోము ఆకట్టుకుంటుంది. మిగిలినవాళ్లంతా కొత్తవాళ్లే.
గుంటూరే.. పాట బాగుంది. గుంటూరు వాసులకు యమగా నచ్చేసే పాట ఇది. శివుడి నేపథ్యంలో సాగే పాటలోనూ చాలా అర్థం ఉంది. మిగిలిన పాటలేవీ గుర్తుండవు. నేపథ్య సంగీతంలో కొన్ని బిట్లు హాంటింగ్ గా ఉంటాయి. అయితే… సంగీత దర్శకుడిలో స్ఫూర్తి నింపేంత గొప్ప సన్నివేశాలు తెరపై అంతగా కనిపించవు. చాలా సాధారణమైన కథ ఇది. సజహమైన కథనంతో రక్తి కట్టించాలని చూశాడు దర్శకుడు. అయితే.. సన్నివేశాల్లో బలం లేకపోవడంతో తన ప్రయత్నం నెరవేరలేదు.