“సవాళ్లు ఎదురైనప్పుడే అసలైన సత్తా ఏంటో తెలుస్తుంది..! సత్తా మాత్రమే కాదు… అప్పటి దాకా తెలియని లోపాలు కూడా వెలుగులోకి వస్తాయి..!” ఈ సూక్తిని ఇప్పుడు భారత రాజ్యాంగం విషయంలో గుర్తు చేసుకోక తప్పదేమో..!. ప్రపంచంలోనే అతి గొప్ప రాజ్యాంగం మనది. ఇప్పుడు ఆ రాజ్యాంగానికే పెను సవాల్ వచ్చి పడింది. ఆ రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నా .. వ్యవస్థలు ఏమీ చేయలేకపోతున్నాయి. అందుకే రాజ్యాంగంలోని బలహీతనలన్నీ బయటకు వస్తున్నాయి.
ఎస్ఈసీ అధికారాలనే ప్రశ్నిస్తే ఇక ఎన్నికల ప్రజాస్వామ్యం ఉంటుందా..!?
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజ్యాంగ ఉల్లంఘన.. దేశ ప్రజాస్వామ్య పునాదుల్ని పెకిలించేలా ఉంది. దేశ ప్రజాస్వామ్యానికి స్వేచ్చాయుత ఎన్నికలే శ్రీరామరక్ష. ప్రజలు స్వచ్చందంగా.. నిర్భయంగా.. ఓటు వేసినప్పుడే ప్రజాస్వామ్య ఫరిడవిల్లుతుంది. అందుకే రాజ్యాంగ నిర్మాతలు.. ఎన్నికల నిర్వహణకు ప్రత్యేకమైన వ్యవస్థల్ని పెట్టి.. వాటిపై ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేకుండా చేశారు. ఎన్నికల విషయంలో… ఎన్నికల వ్యవస్థకే సూపర్ పవర్స్ ఇచ్చారు. కానీ.. ఇప్పుడేం జరుగుతోంది. ఎన్నికల సంఘం డమ్మీగా ఉండాలని.. తామే ఎన్నికలు నిర్వహించాలన్నట్లుగా పరిస్థితిని పాలకులు మార్చేసుకున్నారు. తమకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోరని అనుకుంటున్న కమిషనర్లు ఉంటే.. ఎన్నికలు జరపడానికి అవసరమైన పరిస్థితులు లేవంటున్నారు. రాజ్యాంగ వ్యవస్థ అధిపతిపైనే తిట్ల దండకం అందుకుంటున్నారు. ఆ వ్యవస్థ గౌరవాన్ని కాపాడాల్సిన గవర్నర్, న్యాయవ్యవస్థ నిస్సహాయాలుగా అయిపోతున్నారు. అదే పనిగా ఆదేశాలు ఇచ్చినా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎవరేం చెబితే నాకేం అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఎస్ఈసీనే దాడులను ఎదుర్కోవాల్సి వస్తే.. ఇక సామాన్యులకు రక్షణ ఎక్కడుంటుంది. ఇదే వ్యూహాన్ని రేపు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం అమలు చేస్తే.. దేశంలో ఇక ప్రజాస్వామ్యం ఉంటుందా..? ఎన్నికల సంఘాన్ని ఓ ఆట ఆడుకుని కావాల్సినట్లుగా ఎన్నికలు నిర్వహించుకోరా..? ఇప్పటికే ఆ దిశగా ప్రాథమిక సూచనలు కనిపిస్తున్నాయి. తాజా పరిణామాలతో ముందు ముందు అది మరింత దారుణంగా మారే అవకాశాలనూ కొట్టి పారేయలేని పరిస్థితి. ఎన్నికల వ్యవస్థలకు రక్షణ కల్పించాల్సిన రాజ్యాంగం ఇప్పుడు బేల చూపులు చూస్తోంది.
కోర్టుల్ని లెక్క చేయని ప్రభుత్వలూ వచ్చేశాయ్..!
భారత రాజ్యాంగంలో ప్రభుత్వాలకు ఎంత పవర్ ఉంటుందో.. న్యాయవ్యవస్థకీ అంత కంటే పవర్ ఎక్కువగా ఉంటుంది. ఎవరి అధికారాల్ని వారికి పక్కాగా నిర్వచించారు. ఒకరి విధుల్లో ఒకరు జోక్యం చేసుకోకూడదు. అంతిమంగా ఎన్నికల్లో ప్రజలు ఓట్లేసి గెలిపించినా ప్రభుత్వం … రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే చక్కదిద్దే అధికారం న్యాయవ్యవస్థకు ఉంది. అది రాజ్యాంగం కల్పించింది. కానీ ఇప్పుడేం జరుగుతోంది. కోర్టులు ఇచ్చిన తీర్పులను కూడా.. అమలు చేయని ప్రభుత్వాలు వచ్చాయి. రాజ్యాంగం ప్రకారం.. అలా చేయడం తప్పు అని తీర్పు చెప్పినా అలాగే చేస్తాం.. ఏం చేసుకుంటారో చేసుకోండి అనే ప్రభుత్వాలు వచ్చాయి. న్యాయమూర్తులపై నిందలేసే ప్రభుత్వాలు వచ్చాయి. తమకు వ్యతిరేక తీర్పులు ఇస్తే.. ఇతర రాజకీయ పార్టీలతో లింకులు పెట్టే రాజకీయాలు వచ్చేశాయి. అంటే… ఇప్పుడు.. న్యాయవ్యవస్థపై.. రాజకీయ వ్యవస్థ దారుణంగా దాడి చేస్తోంది. కానీ. న్యాయవ్యవస్థకు ఇసుమంత మాత్రం కూడా.. రక్షణ లభించడం లేదు. చివరికి సర్వోన్నతమైన న్యాయవ్యవస్థకూ.. రక్షణ కల్పించలేనంత నిస్సహాయతకు రాజ్యాంగం పడిపోయింది..! బిక్కుబిక్కుమంటూ చూస్తోంది.
ప్రజల ప్రాథమిక హక్కులూ కాపాడలేకపోతున్న రాజ్యాంగం…!
దేశంలో ప్రజలకు కొన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి. అవి రాజ్యాంగంలో స్పష్టంగా ఉన్నాయి. కానీ.. ఇప్పుడు.. ఆ ప్రాథమిక హక్కులు మారిపోయాయి. అధికారంలో ఉన్న పార్టీ ఆ హక్కుల్ని నిర్దేశిస్తుంది. వారికి వ్యతిరేకంగా మాట్లాడితే రాత్రికి రాత్రే ఆస్తుల్ని కూల్చేశారు. పోలీసుల సాయంతో శాల్తీలు లేకుండా చేసేస్తారు. పోలీసు వ్యవస్థను ప్రైవేటు సైన్యంగా వాడుకుని… అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడతారు. అధికార యంత్రాగాన్ని విధ్వంసానికి వాడుకుంటారు. ప్రభుత్వం ఇలా చేస్తోంది అని.. న్యాయం కోసం కోర్టుకెళ్లే సేమయం కూడా లేకుండా.. వారాంతాల్లో కూల్చివేతలు చేసేస్తారు. అర్థరాత్రిళ్లు పని పూర్తి చేస్తారు. తర్వాత కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నా… నష్టం జరిగిపోతుంది. అక్కడ పగ బట్టిన పాలకులకు కావాల్సింది అదే. కానీ ఈ దేశంలో… సంపూర్ణ స్వేచ్చతో.. ప్రశాంతంగా.. బతకగలిగే హక్కును కల్పించిన రాజ్యాంగం… ప్రజల్ని ఆదుకోలేకపోతోంది. అధికారంలో ఉండే వారి ఆగ్రహానికి గురైతే.. కట్టుబట్టలతో రోడ్డు మీద పడాల్సిన దుస్థితి ఏర్పడుతున్నా… రక్షణ కల్పించలేకపోతోంది. దిక్కూమొక్కూ లేక.. బతకాలంటే… అధికారంలో ఉన్న వారి దయా దాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి కల్పిస్తున్నా… పోరాడటానికి ధైర్యం ఇవ్వలేకపోతోంది.
రాజ్యాంగం అత్యున్నతం..! వ్యవస్థలే భ్రష్టుపట్టిపోయాయి..!
రాజ్యాంగ నిర్మాతలు మొదట్లోనే కీలకమైన మాట చెప్పారు. ఎంత అత్యున్నతమైన రాజ్యాంగం రాసుకున్నా.. అందులో ఉన్న వ్యవస్థలు అన్నీ.. నిష్పక్షిపాతంగా పని చేసిప్పుడే ఆ రాజ్యాంగం గొప్పగా వెలుగులీనుతుందని చెప్పారు. ఆ మాట వంద శాతం నిజం. రాజ్యాంగంలో ఉన్న వ్యవస్థలు ఎంత బాగా తమ విధులు.. రాజ్యాంగం నిర్వచించిన ప్రకారం నిర్వహిస్తే.. దేశంలో ప్రజాస్వామ్యం అంత ఎక్కువగా బలంగా ఉంటుంది. కానీ అధికారం అనే ఆయుధం కోసం.. ముందుగా రాజకీయ పార్టీలు.. రాజ్యాంగాన్ని బలహీనం చేయడం ప్రారంభించాయి. అపరిమితమైన అధికారాన్ని అనుభవిస్తూ.. అన్ని వ్యవస్థల్ని బలహీనం చేయడం ప్రారంభించాయి. అధికార యంత్రాంగానికి ఇప్పుడు వెన్నుముక లేకుండా పోయింది. ప్రజలతో ఎన్నికోబడ్డప్పటికీ.. నియమనిబంధనల ప్రకారం వ్యవహరించకపోతే.. ఆ నిర్ణయాలను తిరస్కరించే స్వేచ్చ అధికారులకు ఉంది. కానీ ఇప్పుడు…. సీనియర్ మోస్ట్ అధికారులు కూడా రాజకీయ బాసులు చెప్పారని రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. ఒక్క అధికార వ్యవస్థలే కానీ.. ప్రస్తుతం దేశంలో ఏ వ్యవస్థ నిజాయితీగా… నిక్కచ్చిగా.. రాజ్యాంగం కల్పించిన హక్కులతో ప్రజల కోసం పని చేస్తుందో చెప్పడం కష్టం. అంతా కలుషితం అయిపోయాయి. అన్ని వ్యవస్థలూ భ్రష్టుపట్టిపోయాయి. దీనికి కారణం ఆ వ్యవస్థలను నడిపించేవారిని కూడా పాలక పార్టీలు నియమించడమే. వారి ప్రాపకం కోసం… ఆ పదవుల్లో ఉన్న వారు దేశానికి చేటు కల్పించి.. తమ పార్టీకి మేలు చేసేందుకు వెనుకాడకపోవడమే.
ప్రజాస్వామ్య దేశంగా ఉండాలంటే రాజ్యాంగాన్ని గౌరవించుకోవాలి..!
భారత్లో రాజకీయ నేతలకు అంతులేని అవినీతి చేసే అధికారం దఖలు పడింది. అంత అవినీతి చేసినా మళ్లీ ప్రజలకు వద్దకు వెళ్లే అవకాశం కూడా ఉంది. వంద మంది దోషలు తప్పించుకోవచ్చుకానీ.. ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదనే న్యాయవ్యవస్థ మూలసూత్రం కేసులు.. ఏళ్లు.. పూళ్లు సాగేలా చేస్తున్నాయి. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన రాజ్యాంగ వ్యవస్థలన్నీ.. అధికార ప్రాపకం కోసం… దిగజారిపోతున్నాయి. ఇలాంటి సమయంలో రాజ్యాంగం బలహీపడిందనే అభిప్రాయం అందరిలో ఏర్పడుతోంది. కానీ రాజ్యాంగం బలంగానే ఉంది. మారాల్సింది.. రాజకీయం.. వ్యవస్థలే. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. కానీ ఆ ప్రజల్నే సక్రమంగా ఓటు వేయకుండా చేస్తే.. వచ్చేది నియంతృత్వమే. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే… రాజ్యాంగాన్ని గౌరవించుకోవాలి. రాజ్యాంగాన్ని పాటించాలి. రాజ్యాంగాన్ని అమలు చేయాలి.. అమలు జరిగేలా చూసుకోవాలి. లేకపోతే.. నష్టపోయేది వ్యక్తులు కాదు.. దేశం. ఎప్పటికీ నిలిచి ఉండేది దేశమే… వ్యక్తులు కాదు. కానీ అధికారం తలకెక్కిన వారు.. తాము శాశ్వతం.. తమ అధికారం శాశ్వతం అనుకోవడం వల్లనే… దేశానికి చేటు జరుగుతోంది. తెలుసుకున్నప్పుడు మాత్రమే.. దేశానికి మేలు జరుగుతుంది.