ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి 33 లక్షల మందికి ఇళ్లపట్టాలంటూ హడావుడి చేస్తూనే ఉంది. దాని కోసం.. భూములు సేకరించారు. వాటిలో చాలా వరకూ మొన్నటి వర్షాకాలంలోచెరువులువుగా మారాయి. మైనింగ్ భూములు, దేవాదాయ భూములు, స్మశానం భూములు ఇలా అన్నింటినీ ఇళ్ల స్థలాలు చేయాలనుకుంటే… కోర్టులు స్టే విధించాయి. ఇక మిగిలిన భూముల్లో..ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే.. నిన్నామొన్నటిదాకా వైసీపీ పెద్దలు ఒకటే ఆరోపణ చేస్తూ వస్తున్నారు. అదే ఇళ్ల పట్టాల పంపిణీని కోర్టు అడ్డుకుంటోందని… టీడీపీ నేతలు కేసులు వేశారని.. ఆ ఆరోపణల సారాంశం. మరి డిసెంబర్ 25నాటికి కోర్టు కేసులన్నీ తేలిపోతాయా.. అనే సందేహం చాలా మందిలో వస్తోంది.
నిజానికి ఇళ్ల పట్టాల పంపిణీకి మొదటి ముహుర్తం.. ఈ ఏడాది ఉగాది. ఉగాదికి 33 లక్షల ఇళ్ల పట్టాలని ప్రభుత్వం హంగామా చేసింది. ఆ తర్వాత స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు. ముందే ప్రకటించినందున ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని పట్టుబట్టారు. మార్చిలో ఎలక్షన్ కోడ్ వల్ల ఎస్ఈసీ ఆపేశారని ప్రచారం ప్రారంభించారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు కోడ్ ఎత్తేసినా ఇళ్ల పట్టాలు పంపిణీ చేయలేదు. వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చారు. వైఎస్ జయంతి.. గాంధీ జయంతి.. అంబేద్కర్ జయంతి.. ఇలా చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత విపక్షాలు కోర్టులకెళ్లి అడ్డుకున్నాయని ప్రచారం ప్రారంభించారు. కేసులు ఉపసంహరించుకోవాలని చంద్రబాబుకు రెండు రోజుల కిందట.. కొడాలి నాని తనదైన భాషలో హెచ్చరించారు కూడా. కానీ ఇప్పుడు అదేమీ లేకుండానే పట్టాల పంపిణీకి ముహుర్తం ఖారారు చేశారు.
అంటే.. ప్రభుత్వం తరపున ఇళ్ల పట్టాల విషయంలో చెప్పిన.. చేసిన కోర్టు కేసుల ఆరోపణలన్నీ రాజకీయమేనని వైసీపీ నేతలే తేల్చేసినట్లయింది. ఇళ్ల స్థలాలను అడ్డుకుంటున్నారని చెప్పినవన్నీ అబద్దాలేనని చెప్పినట్లయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా టిడ్కో ఇళ్ల రాజకీయం రాజుకుంటోంది. కట్టిన ఇళ్లు ఇవ్వకుండా లబ్దిదారులకు వేధింపులు గురి చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కట్టిన ఇళ్లు ఇస్తే రుణాలన్నీ మాఫీ చేస్తామని ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన పని లేదని మేనిఫెస్టోలో హామీ ఇ్చచారు. ఇప్పుడు టిడ్కో ఇళ్లు ఇస్తే రుణం మాఫీ చేయాల్సి వస్తుందని.. ప్రభుత్వం వాటిని ఇవ్వడం లేదనే విమర్శలు రావడానికి కారణం అవుతోంది. ఈ విషయంలో వైసీపీ, ప్రభుత్వం మరింతగా హోమ్ వర్క్ చేయాల్సి ఉంది.