వ్యక్తిగత సేవలు చేసిన వారిని చట్టసభలకు పంపే అధినేతలు భారత రాజకీయాల్లో తరచూ కనిపిస్తూ ఉంటారు. తమిళనాడులో జయలలిత, కరుణానిధిల వద్ద పని చేసిన చాలా మంది అలా ఎంపీలు..ఎమ్మెల్యేలు అయ్యారు. తర్వాత కేసీఆర్ కూడా ఒకరిద్దరికి అలాంటి చాన్సులిచ్చారు. జోగినిపల్లి సంతోష్‌కుమార్‌కు రాజ్యసభ సీటు ఇచ్చేటప్పుడు.. సమయానికి మందులిస్తాడనే క్వాలిటీని బయట పెట్టారు. అప్పుడు అది వివాదాస్పదం అయింది. ఇప్పుడు వారి బాటలోనే జగన్.. తనకు ఫిజియోథెరపి చేసిన డాక్టర్‌కు ఎంపీ టిక్కెట్ ఖరారు చేశారు. పాదయాత్ర అసాంతం తనతో ఉండి.. తనకు కాళ్లు నొప్పులు రాకుండా.. ఎప్పటికప్పుడు ఫిజియో చేసిన డాక్టర్ గురుమూర్తిగా తిరుపతి ఎంపీ టిక్కెట్‌ను ఖరారు చేశారు.
సిట్టింగ్ సభ్యుడు చనిపోతే వారి కుటుంబసభ్యులకే టిక్కెట్ ఇచ్చే సంప్రదాయం ఉంది. అయితే వైసీపీ అధినేత జగన్ అ సంప్రదాయాన్ని లైట్ తీసుకున్నారు. 2019 ఎన్నికల్లో తిరుపతి లోక్ సభ స్థానం నుంచి పోటీచేసి గెలుపొందిన బల్లి దుర్గాప్రసాద్ మరణంతో అక్కడ ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టిలో డాక్టర్ గురుమూర్తి ఉండటంతో .. బల్లి దుర్గాప్రసాద్ కుటుంబసభ్యులకు ఈ సారి టిక్కెట్ రాదని తేలిపోయింది. దీంతో పార్టీ సీనియర్ నేతలను బల్లి దుర్గాప్రసాద్ కుటుంబసభ్యులతో మాట్లాడాలని పురమాయించారు. నేతలు వారితో మాట్లాడి.. సీఎం క్యాంప్ ఆఫీసుకు తీసుకు వచ్చారు. దుర్గాప్రసాద్ కుమారుడు కళ్యాణ్ చక్రవర్తికి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. పార్టీ నిర్ణయించే అభ్యర్థితో కలిసి పని చేయాలని సూచించి పంపేశారు.
అసలు శాసనమండలిని రద్దు చేయాలని జగన్మోహన్ రెడ్డి తీర్మానం చేశారు. ఆ తీర్మానం ప్రతి కేంద్రం వద్ద ఉంది. ఢిల్లీ వెళ్లినప్పుడల్లా.. శాసనమండలిని రద్దు చేయాలన్న తమ తీర్మానాన్ని బిల్లుగా చేసి ఆమోదించాలని.. కేంద్రాన్ని కోరుతున్నట్లుగా వైసీపీ చెబుతూ వస్తోంది. అయినప్పటికీ.. చాలా మందికి సొంతంగా.. ఎమ్మెల్సీ హామీలు ఇచ్చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. గతంలో తాను చెప్పిన మాటల్ని.. చేసిన వ్యాఖ్యల్ని కూడా.. లైట్ తీసుకుంటున్నారనే విమర్శలు వచ్చినా పట్టించుకోవడం లేదు.