గుంటూరు జిల్లా పల్నాడులో మరో ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య చిచ్చు రేగింది. అయితే ఆయన లోక్‌సభ ఎంపీ కాదు. రాజ్యసభ ఎంపీ. ఎమ్మెల్యే గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. వైసీపీ హైకమాండ్‌కు అత్యంత సన్నిహితుడైన.. రాజ్యసభ ఎంపీ అయోధ్యరామిరెడ్డికి రాంకీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత ఆయనకు మరిన్ని ప్రాజెక్టులు లభించాయి. వాటితో పాటు రాజ్యసభ ఎంపీ సీటు కూడా వచ్చింది. అలా వచ్చిన ప్రాజెక్టుల్లో ఒకటి పల్నాడులో రోడ్ల నిర్మాణం.. మరమ్మత్తులు చేపట్టడం. చాలా కాలంగా.. పల్నాడులో రోడ్లు దారుణంగా ఉన్నాయి. నిర్వహణ కోసం ప్రభుత్వం రూపాయి కూడా కేటాయించకపోవడంతో.. రోజు రోజుకు అవి దారుణంగా తయారయ్యారు.
ఏపీ వ్యాప్తంగా అదే పరిస్థితి ఉంది. అయితే.. కొత్తగా గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి… అయోధ్యరామిరెడ్డి కాంట్రాక్ట్ సంస్థపై ఒక్క సారిగా ఫైరయ్యారు. పిడుగురాళ్ల రోడ్డు గుంతలుగా మారి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని.. మరమ్మతులు చేయాలని కాంట్రాక్ట్ సంస్థకు 2 వారాలు గడువిచ్చిన స్పందించలేదని ప్రెస్‌మీట్ పెట్టి మండిపడ్డారు. ఇప్పటికి మూడు వారాలు గడిచిందని.. ఇక ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఈ నెల 29న తుమ్మలచెరువు టోల్‌గేట్‌ను ముట్టడిస్తామని ప్రకటించారు. తుమ్మల చెరువు టోల్ ప్లాజా క్యూబ్ లిమిటెడ్, రాంకీ సంస్థ పరిధిలో ఉన్న టోల్ ప్లాజా అని.. మహేష్ రెడ్డి నేరుగా చెబుతున్నారు.
ప్రజాసమస్యల కోసమే అయితే.. మహేష్ రెడ్డి ఇలా చెలరేగే అవకాశం లేదని.. పార్టీలో అంతర్గత రాజకీయాల కారణంగానే అయోధ్యరామిరెడ్డిపై ఆయన విరుచుకుపడుతున్నారని చెబుతున్నారు. అయోధ్య రామిరెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు కానీ.. గుంటూరు జిల్లా పల్నాడు రాజకీయాల్ని మొత్తం ఆయనే సమన్వయం చేస్తున్నారు. ఈ కారణంగా మహేష్ రెడ్డి.. అయోధ్యరామిరెడ్డికి ఎక్కడో చెడిందని.. అందుకే ఈ వివాదం తెరపైకి వచ్చిందని చెబుతున్నారు. ఈ వివాదాన్ని జగన్ సర్దుబాటు చేయాల్సి ఉంది.