జనసేన అధినేత పవన్ కల్యాణ్ గ్రేటర్లో తన బలం చాటుకునే అవకాశాన్ని చేజేతులా బీజేపీ కోసం త్యాగం చేశారు. గ్రేటర్లో బీజేపీ గెలవాల్సిన అవసరం ఉందని.. వచ్చి అడగగానే.. పోటీ నుంచి వైదొలిగారు. ఇప్పుడు జనసైనికుల చూపు.. తిరుపతి వైపు పడింది. తిరుపతిలోనూ బీజేపీ గెలవాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ త్యాగం చేసేస్తారేమోనని కంగారు పడుతున్నారు. అదే సమయంలో బీజేపీ కూడా వ్యూహాత్మకంగా తామే పోటీ చేస్తామన్నట్లుగా సమాచారాన్ని లీక్ చేస్తున్నారు. అభ్యర్థి ఎంపిక కసరత్తు చేస్తున్నామని .. దీనికి జనసేన కూడా అంగీకరిస్తుందని బహిరంగంగానే చెబుతున్నారు. అందుకే జనసైనికుల్లో కంగారు మొదలయింది.
పవన్ కల్యాణ్.. తాను ప్రారంభించిన పార్టీ కంటే ఎక్కువగా బీజేపీ కోసం తపించిపోతున్నట్లుగా ప్రస్తుత పరిస్థితి ఉంది. తిరుపతి స్థానానికి ఉపఎన్నిక ఖాయమని.. సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణించిన రోజే అందరికీ తెలుసు. అన్ని పార్టీలు ఇందు కోసం అంతర్గతంగా కసరత్తు చేశాయి. టీడీపీ అధినేత అభ్యర్థిని ఖరారు చేసేశారు. తాము మాత్రం ఎందుకు వెనుకబడటం అని.. వైసీపీ అధినేత జగన్ కూడా.. అభ్యర్థిని ఖరారు చేశారు. ఇక అందరి చూపు.. బీజేపీ-జనసేన వైపు పడింది. ఆ కూటమి తరపున ఎవరు పోటీచేస్తారు.. అభ్యర్థి ఎవరవుతారన్న దానిపై చర్చ ప్రారంభమయింది. బీజేపీతో పోలిస్తే.. జనసేనకు అక్కడ మెరుగైన అవకాశాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి పదహారు వేల ఓట్లు మాత్రమే సాధించింది. జనసేన పొత్తులో భాగంగా బీఎస్పీకి అప్పగించింది.
ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఏపీకి బీజేపీ అన్యాయం చేస్తోందన్న ప్రజల అభిప్రాయంలో మార్పు రాకపోగా.. మరింతగా ఇబ్బంది పెడుతోందన్న అభిప్రాయం పెరుగుతోంది. ఇలాంటి సమయంలో బీజేపీ పోటీ చేయడం కన్నా.. జనసేన పోటీ చేయడం బెటరన్న అభిప్రాయం ఎవరికైనా కలుగుతుంది., అయితే.. ఇదే ఫీలింగ్ జనసేనలో మాత్రం కలుగుతుందా.. పవన్ కల్యాణ్‌లో రగులుతుందా.. అన్నది మాత్రం సందేహాస్పదంగా మారింది. బీజేపీ ఇప్పటి వరకూ రెండు సార్లు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసింది… కానీ.. జనసేన ఒక్క సారి కూడా ఆ పని చేయలేదు. దీంతో.. తిరుపతి సీటును కూడా బీజేపీకి ధారదత్తం చేస్తారేమోనన్న అనుమానం జనసైనికుల్లో ప్రారంభమయింది.
జనసైనికులు ఇప్పటికే తీవ్ర నిరాశలో ఉన్నారు. యుద్ధం చేసి ఓడిపోవడం వేరు.. అసలు యుద్ధమే చేయకుండా… పారిపోవడం వేరు. పవన్ కల్యాణ్.. పిడికిలి బిగించి యుద్ధం చేస్తామని ప్రకటిస్తారు.. ఆ ఆవేశం నచ్చిన ఫ్యాన్స్ .. తాము కూడా ఆవేశపడతారు. చివరికి వచ్చే సరికి.. పవన్ కల్యాణ్ యుద్ధ బరిలోకి దిగడంలేదు. ఇప్పటికే చాలా సార్లు అలా జరిగింది. ఇక ముందు అలాగే జరిగితే.. పవన్ పై ఫ్యాన్స్ కు నమ్మకం పోతుంది. అంటే పునాదులు కదిలిపోయినట్లే అవుతుంది. జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.