రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాలు రెండు విభిన్నమయిన సమస్యలు ఎదుర్కొన్నాయి. మొదట్లో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా ఆందోళన కలిగించినప్పటికీ, తెదేపా-బీజేపీల మధ్య నెలకొని ఉన్న బలమయిన అనుబంధం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి భరోసా కారణంగా త్వరలోనే ఆ ఆందోళన నుండి రాష్ట్ర ప్రజలు బయటపడగలిగారు. అంతవరకు తీవ్ర విద్యుత్ కోతలతో సతమతమయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడు నెలల వ్యవధిలోనే ఆ సమస్యను అధిగమించగలగడంతో ప్రజలలో తెదేపా ప్రభుత్వం పట్ల నమ్మకం ఏర్పడింది. అదే సమయంలో తెలంగాణాలో విద్యుత్ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు వంటివి ఆ రాష్ట్రాన్ని పట్టి కుదిపివేసాయి. కానీ ఆ తరువాత కొద్ది కాలానికే రెండు రాష్ట్రాల పరిస్థితులు తారుమారు అయ్యేయి.
తెలంగాణాలో తెరాస ప్రభుత్వం తన సమస్యలన్నిటి నుండి బయటపడి రాష్ట్ర ఆర్ధిక, పారిశ్రామిక రాజకీయ పరిస్థితులను అదుపులోకి తెచ్చుకొని దూసుకుపోతుంటే, ఆంధ్రప్రదేశ్ లో తెదేపా ప్రభుత్వ పరిస్థితి మళ్ళీ మెల్లగా దిగజారుతున్నట్లు కనిపిస్తోంది. అందుకు ప్రధాన కారణం ఆర్ధిక లోటేనని చెప్పవచ్చును. సుమారు రెండేళ్ళు గడుస్తున్నా కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ప్రకటించిన ఆర్ధిక ప్యాకేజి, ప్రత్యేక హోదా వంటివేవీ ఇవ్వకపోవడంతో ఆశించినంతగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేకపోతోంది.
మొదట్లోనే హూద్ హూద్ తుఫాను రావడం, తెలంగాణా ప్రభుత్వంతో నిత్యం కీచులాటలు, ఆ తరువాత ఓటుకి నోటు కేసు, పక్కలో బల్లెంలాగ తయారయిన జగన్మోహన్ రెడ్డి చేసే ఉద్యమాలు వంటి సమస్యలతోనే పుణ్యకాలం కాస్త పూర్తయిపోతోంది. దాదాపు రెండేళ్ళు కావస్తున్నా ఇంతవరకు రాజధాని నిర్మాణం మొదలవలేదు. వైజాగ్, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుల నిర్మాణం మొదలవలేదు. పోలవరం సంగతి ఏమయిందో ఎప్పటికి పూర్తవుతుందో ఎవరికీ తెలియదు.
తెలంగాణాలో తెదేపా చాలా వేగంగా తుడిచిపెట్టుకుపోతుండటం కూడా తెదేపా ప్రభుత్వానికి ఇప్పుడు మరొక ఆందోళనకరమయిన విషయంగా మారింది. ఎందుకంటే ఆ కారణంగా తెలంగాణాలో బీజేపీ తెదేపాకు దూరం అయినట్లయితే, ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై కూడా పడుతుంది. తెదేపాను తీవ్రంగా వ్యతిరేకించే సోము వీర్రాజు లేదా పురందేశ్వరిలలో ఎవరో ఒకరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా ఎన్నికయితే, ఇక ఏపిలో కూడా తెదేపా, బీజేపీల బంధం తెగిపోయే ప్రమాదం ఉంటుంది. అదే గనుక జరిగితే రాష్ట్రానికి కేంద్ర సహాయసహకారాలు తగ్గిపోవచ్చును. ఒకవేళ బీజేపీ వైకాపాతో చేతులు కలిపినట్లయితే దాని వలన తెదేపా ప్రభుత్వం ఇంకా ఇబ్బందులలో పడవచ్చును. ప్రస్తుతానికి తెదేపాతో కలిసి కొనసాగినా ఒకవేళ ఎన్నికలకు ముందు విడిపోవాలని బీజేపీ భావించినట్లయితే అందుకు అనుగుణంగానే తెదేపాతో వ్యవహరించడం మొదలుపెట్టవచ్చును. ఈ రెండేళ్ళ కాలంలో చంద్రబాబు నాయుడు, మోడీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో పూర్తిగా విఫలమయ్యారు కనుక మున్ముందు కూడా ఆయన విన్నపాలను మోడీ పట్టించుకోకపోవచ్చును. ఏవిధంగా చూసినా రాష్ట్ర ప్రభుత్వం మున్ముందు చాలా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తోంది.
బహుశః ఈ సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్ళించడానికే అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వం శక్తికి మించిన పట్టిసీమ ప్రాజెక్టు, గోదావరి పుష్కరాలు, అమరావతి శంఖుస్థాపన, తాత్కాలిక సచివాలయ నిర్మాణం, ఇంటర్నేషనల్ ఫ్లీట్ ఫెస్టివల్ వంటి పనులను తలకెత్తుకొని చాలా అట్టహాసంగా నిర్వహిస్తుంటారు. తద్వారా రాష్ట్రంలో ‘ఆల్ ఈజ్ వెల్’ అని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ పంట రుణాల మాఫీ, కాపులకు ఏడాదికి వెయ్యి కోట్ల కేటాయింపు, రాజధాని నిర్మాణంలో జాప్యం వంటివన్నీ రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక దుస్థితికి అద్దం పడుతుంటాయి.
కేంద్రం సహకరించకపోతే రాష్ట్రం తేరుకోవడం చాలా కష్టం. కేంద్రం అరకొరగా విదిలిస్తున్న నిధులన్నీ ఇటువంటి ఆర్భాటాలకు అనవసరమయిన పనులకే కైంకర్యం అయిపోతున్నప్పుడు, రాష్ట్రంలో అభివృద్ధి ఎండమావిగానే మిగిలిపోవచ్చును. మోడీ ప్రభుత్వంపట్ల చంద్రబాబు నాయుడు ఎంతగా అణిగి మణిగి ఉన్నా ఫలితం లేనప్పుడు, ఇక బీజేపీతో తెగతెంపులు చేసుకొని దానిపై యుద్ధం ప్రకటిస్తే రాష్ట్రంలో బీజేపీని కాపాడుకొనేందుకయినా కేంద్రం రాష్ట్రానికి సహాయ సహకారాలు అందిస్తుందేమో? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల మోడీ ప్రభుత్వం ఇక ముందు కూడా ఇదే విధంగా ఉదాసీనత కనబరిచినట్లయితే ఏదో ఒకరోజు తెదేపా బీజేపీతో తెగతెంపులు చేసుకొన్నా ఆశ్చర్యపోనవసరం లేదు.