ఏపీలో రాష్ట్ర రహదారులపై టోల్ బాదుడుకి రంగం సిద్ధమయింది. సంక్షేమ పథకాల కారణంగా వట్టిపోయిన ఖజానాను నింపుకునేందుకు ప్రజలపై పన్నుల భారం మోపాలని నిర్ణయించుకుంది. ఇప్పటి వరకూ జాతీయ రహదారులపైనే ఉన్న టోల్ చార్జీలను ఇప్పుడు రాష్ట్ర రహదారులపైనా వసూలు చేయాలని నిర్ణయించారు. ఇక సాధారణ రోడ్లపైనా ఈ టోల్ చార్జీలు వసూలు చేస్తారు. ఇందు కోసం విధి విధాలను కూడా ఖరారు చేశారు. రెండు వరుసల రోడ్డు ఉన్నా టోల్ చార్జీ వసూలు చేయనున్నారు. రోడ్లపై ఒకే మార్గంలో 30 కిమీ పరిధిలో టోల్‌ప్లాజాను ఏర్పాటు చేస్తారు. మున్సిపాలిటీలు, నగరాలకు పది కిలోమీటర్ల దూరంలో వాటిని ఏర్పాటు చేస్తారు. కారు, జీపు, వ్యాను వంటి వాటికి వంద కిలోమీటర్లు రాష్ట్ర రహదారులపై కారుతో ప్రయాణిస్తే.. 90 రూపాయలు ప్రభుత్వానికి చెల్లించుకోవాల్సి ఉంటుంది.
వాణిజ్య, సరుకు రవాణా వాహనాలతోపాటు మినీ బస్సులకు కిలోమీటర్‌కు ఇంకా ఎక్కువ. టోల్ చార్జీలు భారీగా పెంచడం వల్ల… నిత్యావసర వస్తవుల రవాణా చార్జీలు కూడా భారీగా పెరగనున్నాయి. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కారణంగా రవాణా రంగం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. తాజాగా.. రాష్ట్ర రహదారుల్లోనూ టోల్ చార్జీలు వసూలు చేయడం అంటే నిత్యావసర ధరలకు అడ్డూ అదుపూ లేకుండా చేయడమేనని అంటున్నారు. కరోనా వల్ల ప్రజలు ఉపాధి కోల్పోయి తీవ్రంగా ఇబ్బంది పడుతూంటే.. వారి వద్ద నుంచే పన్నుల రూపంలో పిండుకునే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తోంది. మోయలేని భారాన్ని మోపుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అయితే ఇక్కడ ప్రజలకు పెద్ద రిలీఫ్ లభించింది. అదేమింటటే… బైక్‌లకు టోల్ లేదు. ముఖ్యమంత్రి గతంలో దిశ ఘటన గురించి అసెంబ్లీలో మాట్లాడుతూ.. టోల్ కట్టడానికి బైక్ ఆపిందని చెప్పారు. అంటే.. బైక్‌లకు కూడా టోల్ వసూలు చేస్తారని ఆయన అనుకున్నారు. ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అదే అనుకుని అధికారులు … ఏపీలో వసూలు చేయాలనున్న టోల్ చార్జీల్లో బైక్‌లను కూడా కలిపేయలేదు. అందుకే..ఏపీ ప్రజలు సంతోషించాల్సిన అవసరం ఉంది.