గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా సినీ ప్రముఖుడు మరియు వైఎస్సార్ సీపీ నాయకుడు పోసాని కృష్ణ మురళి టిఆర్ఎస్ కు మద్దతు ప్రకటించారు. అయితే ఆయన మద్దతు ప్రకటించిన కాసేపటికే సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. వివరాల్లోకి వెళితే..
వైకాపా నాయకుడైన పోసాని, టిఆర్ఎస్ కు మద్దతు ఎందుకంటే:
పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ కెసిఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణను బాగా అభివృద్ధి చేశాడని, తెలంగాణలోని సమస్యలన్నింటినీ తీర్చేశాడని, మరీ ముఖ్యంగా ఆంధ్ర ప్రాంత ప్రజలను కూడా ఎంతో బాగా చూసుకుంటున్నారు అని, అందుచేత తను కెసిఆర్ ఆధ్వర్యంలోని టిఆర్ఎస్ పార్టీకి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా మద్దతు ప్రకటిస్తున్నాను అని వ్యాఖ్యలు చేశారు.
తను వైఎస్ఆర్సీపీ నాయకుడు అయ్యి ఉండి కూడా టిఆర్ఎస్ కు మద్దతు బహిరంగంగా ప్రకటించడం చర్చకు దారి తీసింది. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే వైఎస్ఆర్సిపి బిచాణా ఎత్తివేసి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయుము అని ప్రకటించిన విషయం తెలిసిందే. వైయస్ రాజశేఖర రెడ్డికి తెలంగాణలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది అని, తమ పార్టీ కి తెలంగాణలో కూడా మంచి భవిష్యత్తు ఉంది అని చెప్పుకునే వైఎస్ఆర్సిపి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎందుకు వెనుకాడుతూ ఉందో అర్థం కావట్లేదు అంటూ ఆ పార్టీ అభిమానులు విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో పోసాని కృష్ణ మురళి ద్వారా పార్టీ అభిమానులకు పరోక్షంగా టిఆర్ఎస్ కు మద్దతు ఇవ్వమని వైఎస్ఆర్సిపి సంకేతాలు జారీ చేస్తోందని వారు విశ్లేషిస్తున్నారు.
సోషల్ మీడియాలో విమర్శలు:
ఇదంతా ఒక ఎత్తయితే, సరిగ్గా ఎన్నికలు సమయంలో మాత్రం బయటకు వచ్చి పోసాని కృష్ణ మురళి కెసిఆర్ కు మద్దతు ప్రకటించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక ఏడాదిన్నర కిందట ఇంటర్ విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం చేసే విధంగా పరిణామాలు జరిగినప్పుడు, యావత్ తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు వారి పేరెంట్స్ రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేసినప్పుడు, పోసాని కృష్ణ మురళి వారికి మద్దతు ప్రకటించలేదని, సినిమాలలో విద్యార్థుల భవిష్యత్తు దేశానికి ఎంత ముఖ్యం అన్న దాని గురించి గురించి పేజీలకు పేజీలు డైలాగులు రాసే పోసాని, లక్షలాది మంది విద్యార్థులు మీడియా సాక్షిగా తమకు జరిగిన అన్యాయానికి ఏడ్చి గగ్గోలు పెడుతున్నప్పుడు ఎక్కడ దాక్కున్నాడని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.
మొన్నటి వరదల ప్రస్తావన :
అదేవిధంగా వరదల గురించి కూడా పోసాని కృష్ణమురళి ప్రస్తావించారు. ఇలా వరదలు వస్తూ ఉండడం మామూలేనని అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు చేశారు. అయినప్పటికీ కేసీఆర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ బాగా చేశారని పోసాని కితాబిచ్చారు. అయితే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వమని ప్రజలను కోరుతున్న పోసాని కృష్ణమురళి, ఆ ప్రజలు వరదల్లో చిక్కుకుని హాహాకారాలు చేస్తున్నప్పుడు వారికి ఏ రకంగా అండగా నిలిచారో చెప్పాలని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.
మొత్తానికి పోసాని కృష్ణమురళి టిఆర్ఎస్ కు మద్దతు ప్రకటించడం కారణంగా టిఆర్ఎస్ కు కొత్తగా ఒరిగేది ఏమీ ఉండక పోయినప్పటికీ, అనవసరమైన విషయాల్లో వేలు పెట్టినందుకు పోసాని విమర్శలు కొని తెచ్చుకున్నట్లుగా కనిపిస్తోంది.