గ్రేటర్ ఎన్నికల్లో ఎవరూ పిలవకుండానే సినీ తారలు ప్రచారానికి సిద్ధమవుతున్నారు. వారందరూ తెర మీదకు వచ్చేది ఖచ్చితంగా ఓటు వేయండి అనే.. సోషల్ రెస్పాన్సిబులిటీ క్యాంపెన్ చేసేందుకు కాదు.. తెలంగాణ రాష్ట్ర సమితికి ఓటు వేయమని వి జ్ఞప్తి చేసేందుకు. ఇప్పటికే ఓపిక లేకపోయినా పోసాని కృష్ణమురళి తెర మీదకు వచ్చేశారు. ఆయన తన ప్రచారం తాను చేశారు. ఇక సుమ కూడా.. కేటీఆర్‌ను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. నేరుగా ప్రచారం చేయకపోయినా.. ఇదో రకం సపోర్ట్ అనుకోవడమే. ఇక స్టూడియో కోసం ఐదెకరాలు పొందిన దర్శకుడు శంకర్ కూడా రంగంలోకి వచ్చేశారు. మద్దతు ప్రకటనలు చేశారు.
సినీ తారలకు… సెలబ్రిటీలకు.. చాలా పరిమితులు ఉంటాయి. అలాగని.. మద్దతు తెలియ చేయకుండా ఉండలేని పరిస్థితి. ఎలాగోలా అడగకపోయినా తమ సపోర్ట్ ప్రకటించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ పనిలోనే టాలీవుడ్ సెలబ్రిటీలు ఉన్నట్లుగా తెలుస్తోంది. టీఆర్ఎస్ అంటే.. టాలీవుడ్ సెలబ్రిటీలందరికీ భయభక్తులు ఉన్నాయి. అడిగినా అడగకపోయినా… సోషల్ మీడియాలో సపోర్ట్ ప్రకటనలు చేసేందుకు చాలా మంది రెడీగా ఉంటారు. ఇటీవలి కాలంలో… ఎంపీ సంతోష్ ఇచ్చిన పిలుపునకు.. స్పందించని.. టాలీవుడ్ యాక్టర్ లేరంటే అతిశయోక్తి కాదు. ప్రతీ ఒక్కరూ మొక్క నాటారు. ఇక టీఆర్ఎస్ అగ్రనేతల పుట్టిన రోజులు వస్తే.. పొద్దున్నే ట్వీట్ చేస్తారు.
అయితే.. సోషల్ కాజ్ కోసం.. సపోర్ట్ చేయడం వేరు.. ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతు తెలియచేయడం వేరు.. టీఆర్ఎస్ కు నేరుగా సపోర్ట్ చేస్తే.. వారి పై పార్టీ ముద్ర పడుతుంది. అది వారికి అసలు ఇష్టం ఉండదు. అందుకే.. పార్టీ ముద్ర పడకుండా టీఆర్ఎస్‌కు ఓటు వేయాలని ప్రచారం చేయనున్నారు. దాని కోసం.. సినీ ఇండస్ట్రీలోని క్రియేటివీటి అంతా ఉపయోగించుకునే అవకాశం ఉంది. నేరుగా ప్రచారం చేయమని.. టీఆర్ఎస్ పెద్దలు కూడా ఒత్తిడి చేయకపోవచ్చు. బీజేపీ తరపున పవన్ కల్యాణ్ రంగంలోకి దిగితే.. టీఆర్ఎస్ తరపున నేరుగా ప్రచారబరిలోకి వచ్చే తారల సంఖ్య కూడా ఎక్కువే ఉండొచ్చు.