విశ్వవిద్యాలయాల్లో.. తమకు ఇష్టం వచ్చిన వారిని వైస్ చాన్సలర్లుగా నియమించుకునే హక్కును దఖలు పర్చుకుంటూ.. ఏపీ సర్కార్ చేసిన బిల్లుపై సంతకం పెట్టేందుకు గవర్నర్ నిరాకరించారు. ఆ బిల్లును వెనక్కి పంపారు. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా… వైస్ చాన్సలర్ల నియామకంలో రాజకీయ పాత్ర ఉండేలా బిల్లును మార్చారు. సెర్చ్ కమిటీ అక్షర క్రమంలో ముగ్గురు వ్యక్తులతో ఒక ప్యానెల్‌ను ప్రభుత్వానికి సమర్పిస్తుందని, ప్రభుత్వ సిఫార్సుపై సదరు ప్యానెల్ నుంచి ఒకరిని ఉపకులపతిగా కులపతి నియమించాలని సవరణ తీసుకొచ్చారు. యూజీసీ నిబంధనల ప్రకారం విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల నియామకంలో ప్రభుత్వ పాత్ర ఉండదు. సెర్చ్ కమిటీ సూచించిన 3 పేపర్లలో నుంచి ఒకరిని చాన్సలర్ హోదాలో గవర్నరు నియమిస్తారు. కానీ అలాకాకుండా ప్రభుత్వ సిఫార్సుల మేరకు వైస్ చాన్సలర్లను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయాల చట్టానికి సవరణలు చేసింది. దీనిపై కోర్టుల్లో పిటిషన్లు పడ్డాయి.
ప్రభుత్వం తాను చేసిన చట్టం ప్రాకరం.. శ్రీవేంకటేశ్వర, శ్రీకృష్ణదేవరాయ, రాయలసీమ, ద్రవిడ, ఆచార్య నాగార్జున, ఆంధ్ర విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్లను నియమించాలని ఫైల్‌ను గవర్నర్‌కు పంపింది. ఈ ఫైల్‌ను గవర్నర్ పెడింగ్‌లో పెట్టారు. జగన్ స్వయంగా వెళ్లి బిల్లును క్లియర్ చేయాలని అడిగినా చేయలేదు. న్యాయనిపుణుల సలహా అనంతరం వాటిని వెనక్కి పంపింది. దీంతో ప్రభుత్వానికి షాక్ తగిలినట్లయింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్… ఏపీ సర్కార్ నుంచి వస్తున్న బిల్లులు విషయంలో ఆచితూచి వ్యవహరించడం ప్రారంభించారు. నిన్నామొన్నటిదాకా ఆయన ప్రభుత్వం నుంచి వచ్చే ఫైళ్లపై కాస్త అటూ ఇటూగా అయినా సంతకం చేసేవారు.
కాస్త ఆలస్యమైతే.. ప్రభుత్వం నుంచి బుగ్గననో.. మరో మంత్రో.. లేకపోతే సీఎంవో ఉన్నతాధికారులో వచ్చి ఒత్తిడి చేసి సంతకం చేయించుకునేవారు. ఎస్‌ఈసీ గా కనగరాజ్ నియామకం విషయంలో అదే జరిగింది. అయితే.. ఇప్పుడు.. ప్రభుత్వ నిర్ణయాలన్నీ కోర్టుల్లో తేలిపోతూండటంతో… ఆయన సిన్సియర్‌గా న్యాయసలహాలు తీసుకుంటున్నట్లుగా వీసీల ఫైల్ వెనక్కి పంపడంతో తేలిపోయింది.