ఆంధ్రప్రదేశ్ సీనియర్ సివిల్ సర్వీస్ అధికారులు మెల్లగా తమ దారి తాము చూసుకుంటున్నారు. ఢిల్లీలో తమకు ఉన్న పరిచయాలతో కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా మహేష్ చంద్ర లడ్హా కేంద్ర సర్వీసుకు వెళ్లారు. ద్వారకా తిరుమల రావు రేపోమాపో వెళ్లనున్నారు. డీజీపీ, డీఐజీ స్థాయి అధికారులు కూడా కేంద్ర సర్వీసుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరికొంత మంది కూడా.. బయట పడకపోయినా.. ముందు ఢిల్లీలో గ్రీన్ సిగ్నల్ తెచ్చుకుని ఆ తర్వాత ఏపీ సర్కార్ కు దరఖాస్తు చేసుకుటే.. తిరస్కరించే అవకాశం ఉండదని అంచనా కొచ్చి ఆ వైపు నుంచి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
తమ సర్వీసులో ఏర్పడిన పరిచయాలతో లాబీయింగ్ చేసుకుని అయినా సరే… ఏపీ నుంచి వెళ్లాలనే ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన కాస్త విచిత్రంగా ఉందనే వాదనలు ఉన్నాయి. పోలీస్ బాస్‌కు తెలియకుండా.. పోలీసు వ్యవహారాలు నడిచిపోతూంటాయి. సీఎస్‌కు తెలియకుండా ఆదేశాలు వచ్చేస్తూంటాయి. అలాగే.. అన్ని శాఖల ప్రధాన కార్యదర్శలకు తెలియకుండానే.. పనులు .. ఫైళ్లు నడిచిపోతున్నాయి. అధికారులు కేవలం పదవిలో ఉండటానికేన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. చాలా కొద్ది మంది సలహా దారుల గుప్పిట్లోనే అన్ని శాఖలు చిక్కుకుపోయాయంటున్నారు. ఈ కొద్దిమందిలో మళ్లీ అతి కొద్ది మంది మాత్రమే.. అధికారులు. మిగిలిన వారంతా.. అనధికార వ్యక్తులు.
తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కోర్టుల్లో నిలబడటం లేదు. చాలా వరకు.. తప్పుడు నిర్ణయాలు. రేపు ఏదైనా తేడా వస్తే.. కేసులు పాలవడం కూడా ఖాయమన్న చర్చ జరుగుతోంది. సాధారణంగా వైసీపీ నేతలకు లబ్ది కలిగించే నిర్ణయాలు తీసుకుంటే.. వారు లబ్దిపొందుతారు.. కానీ తర్వాత అవకతవకల కేసులు పడితే వారికేమీ నష్టం ఉండదు. ఎందుకంటే.. ఆ నిర్ణయాలు తీసుకున్న అధికారులకు మాత్రమే.. నష్టం. వారే బాధ్యులవుతారు. ఈ ఆలోచనే.. ఐపీఎస్‌లతో పాటు ఐఏఎస్‌లలోనూ ఆందోళన కలిగిస్తోందని చెబుతున్నారు. ఎవరో ఎందుకు సీఎంవో ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారన్న విషయం కూడా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.