గ్రేటర్లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా పోరు సాగడం లేదని కాంగ్రెస్ కూడా రేసులో ఉందని నిరూపించేందుకు రేవంత్ రెడ్డి తన వంతు పాత్ర నిరాటంకంగా చేస్తున్నారు. కార్యకర్తలు అభ్యర్థులకు ఎక్కడ కష్టం వచ్చినా వాలిపోతున్నారు. అప్పటికప్పుడు న్యాయపోరాటానికి సాయం చేస్తున్నారు. అదే సమయంలో బీజేపీ, టీఆర్ఎస్ ఒకటే అని చెప్పేందుకు రేవంత్ తనదైన వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. బీజేపీ తరపున టీఆర్ఎస్పై పోరాడేందుకు.. చార్జ్ షీట్ పేరుతో.. ఓ నివేదిను విడుదల చేసేందుకు కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్ హైదరాబాద్ వచ్చారు. కేంద్ర నిధులను కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని.. టీఆర్ఎస్, కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఎంఐఎంకు వేసినట్లేనని ఆయన చార్జ్‌షీట్‌ను విడుదల చేసి విమర్శించారు.
ఇంకా చాలా చాలా విమర్శలు చేశారు. అయితే వెంటనే రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. టీఆర్ఎస్తో లాలూచీ లేకపోతే… బీజేపీ నేతలు చేసిన ఫిర్యాదులపై కూడా ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. అందులో మొదటిగా.. నిజామాబాద్ ఎంపీ అరవింద్.. మైహోం గ్రూప్ కంపెనీలపై చేసిన.. అక్రమ మైనింగ్ ఫిర్యాదును ప్రస్తావించారు. అందులో అన్నీ వాస్తవాలే ఉన్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదేనన్నది రేవంత్ ప్రశ్న. అదొక్కటే కాదు.. కేంద్ర నిధులు దుర్వినియోగం చేశారని అంటున్నప్పుడు.. దర్యాప్తు మీ చేతుల్లోనే ఉన్నప్పుడ ుఎందుకు చర్యలు తీసుకోలేదని మరో ప్రశ్న. బీజేపీ, టీఆర్ఎస్ , ఎంఐఎం కుమ్మక్కయి.. కాంగ్రెస్ లేకుండా చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ విమర్శిస్తున్నారు.
ఓ వైపు.. బీజేపీ, టీఆర్ఎస్ నేతల్ని ఎదుర్కొంటూనే మరో వైపు పార్టీ అభ్యర్థులకు అండగా ఉండేందుకు పరుగులు పెడుతున్నారు. గాజుల రామారం కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ను తిరస్కరించారని తెలియగానే అక్కడికి వెళ్లారు. ఓ వైపు హైకోర్టులో పిటిషన్ వేయించారు. అధికారులు ఎలాగూ అభ్యర్థి నామినేషన్ ను తిరస్కరిస్తారని న్యాయపోరాటం చేశారు. స్టే తీసుకు వచ్చారు. అభ్యర్థి బరిలో ఉండేలా చూసుకున్నారు. అధికారంగా రేవంత్ కు బాధ్యతలివ్వకపోయినా.. తన బాధ్యతగా పరుగులు పెట్టి కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్నారు.