న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థపై సోషల్ మీడియాలో జరిగిన దాడి, వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు అన్నీ.. ఓ ప్రణాళిక ప్రకారం జరిగాయన్న అభిప్రాయంతో సీబీఐ దర్యాప్తు చేయడం కలకలం రేపుతోంది. ఈ అంశంపై గతంలో హైకోర్టుకు లేఖ రాసిన వీవీ లక్ష్మినారాయణ అనే న్యాయవాదిని సీబీఐ అధికారులు ప్రశ్నించి పలు ఆధారాలు తీసుకున్నారు. సోషల్ మీడియాలో ఆర్గనైజ్డ్గా ప్రచారం ఎలా జరుగుతుంది..? న్యాయవ్యవస్థను ఎలా బ్లాక్ మెయిల్ చేయాలనుకున్నారు..? ఆ పోస్టులన్నీ ఎక్కడ సిద్ధం అవుతాయి..? లాంటి వివరాలన్నీ ఆయన సీబీఐ అధికారులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో.. ఇదంతా ఆవేశంతో ఆయా పార్టీల కార్యకర్తలు అన్నది కాదని.. ఓ చోట నుంచి ప్రణాళిక ప్రకారం.. సిద్ధమైన ప్లాన్ అని సీబీఐ ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లుగా భావిస్తున్నారు. హైకోర్టు కూడా ఈ ఉద్దేశం ప్రకారమే విచారణకు ఆదేశించడంతో త్వరలో విచారణ కీలక మలుపు తిరిగే అవకాశం ఉందంటున్నారు.
సీబీఐ ఉన్నతాధికారులు విజయవాడలో మకాం వేసి విచారణ ప్రారంభించారు. సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి హైకోర్ట్ రిజిస్ట్రార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగం అధికారులు నమోదు చేసిన 12 కేసులను సీబీఐ స్వాధీనం చేసుకుంది. గుంటూరుకు చెందిన హైకోర్ట్ న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ వద్ద నుంచి సీబీఐ సమాచారాన్ని సేకరించింది. శనివారం హైకోర్ట్ రిజిస్ట్రార్ ను కలిసి సీబీఐ పలు వివరాలు సేకరించింది. సోషల్ మీడియాలో హైకోర్ట్ కు, న్యాయమూర్తులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినవారిని ఇప్పటికే సీబీఐ గుర్తిచింది. వారందర్నీ విచారణకు పిలువనుంది. వీరిలో కొందరు ఇప్పటికే తమ పోస్టులను వారి ఖాతాల్లో నుంచి తొలగించారు. అయితే సోషల్ మీడియాలో అప్పట్లో వీరు పోస్ట్ చేసిన పోస్టుల కాపీలను తీసి, వారి ఖాతాల వివరాలు, ప్రొఫైల్ తో సహా అనేకమంది హైకోర్ట్ కు ఫిర్యాదు చేశారు.
సోషల్ మీడియాలో వారు చేసిన కామెంట్ల వీడియో టేపులు సైతం సీబీఐ ఇప్పటికే సేకరించింది. అటు హైకోర్ట్ రిజిస్ట్రార్, ఇటు న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ వారి వద్ద ఉన్న ట్విట్టర్, ఫేస్ బుక్ పోస్టింగ్స్, ప్రొఫైల్స్ తో సహా వీడియో టేపులను కూడా సీబీఐకి అందజేశారు. సీఐడీ కేసులు పెట్టిన వారినే కాక… హైకోర్టు నోటీసులు జారీ చేసిన వారిపైనా త్వరలో కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. అసలు ఇదంతా వ్యవస్థీకృతమైన నేరం అని.. దీని వెనుక ఉన్న వ్యక్తులెవరో తేల్చాలన్న పట్టుదలతో సీబీఐ ఉన్నట్లుగా తెలుస్తోంది.