పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఏపీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమవుతోంది. గత ప్రభుత్వం ఆ ప్రాజెక్టును చూసి రమ్మని బస్సులేసింది. కానీ ఈ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును చూసేందుకు వెళ్తున్న వారిని ఎక్కడిక్కకడ అరెస్ట్ చేస్తోంది. పోలవరంపై ఏర్పడిన అనుమానాల నేపధ్యంలో ఆదివారం సీపీఐ చలో పోలవరంకు పిలుపునిచ్చారు. ఆ పార్టీకి చెందిన నేతలు పోలవరం వద్దకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమానికి మీడియాలో పెద్దగా ఫోకస్ రాలేదు. కానీ.. పోలీసులు మత్రం పోలవరం వద్దకు సీపీఐ నేతలు వెళ్లకూడదన్నట్లుగా ఎక్కడిక్కడ అరెస్ట్ చేశారు. ఇలా హౌస్ అరెస్టులు చేయడంతోనే ఆ కార్యక్రమం ఒకటి ఉందని.. హైలెట్ అయింది. పోలవరం చూసేందుకు వెళ్తే అరెస్ట్ చేయడం ఏమిటన్న విమర్శలు రావడానికి కారణం అయ్యాయి.
పోలవరంలో శరవేగంగా పనులు జరుగుతున్నాయని ప్రభుత్వం చెప్పుకుంటోంది. రాత్రింబవళ్లు ఇరవై నాలుగు గంటలూ కాంట్రాక్ట్ సంస్థ మేఘా ఇంజినీరింగ్ పనులు చేస్తోందని అధికార పార్టీ మీడియాలో కూడా చెబుతున్నారు. అలాంటప్పుడు… ఇలా రాజకీయ పార్టీల నేతలు వెళ్లి చూస్తేనే.. కదా.. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అదేదో నిషిధ్ధ ప్రాంతం అయినట్లుగా.. అక్కడికి వెళ్లే వారిని అరెస్ట్ చేయడం ఏమిటన్న అభిప్రాయం.. రాజకీయవర్గాల్లో ప్రారంభమయింది. అక్కడ పనులేమీ జరగడం లేదని విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ప్రభుత్వమే బలం చేకూరుస్తున్నట్లుగా అయింది.
తాము గొప్పగా పనులు చేస్తున్నామని.. ప్రాజెక్టును చూడాలని గత ప్రభుత్వం అన్ని ప్రాంతాల నుంచి ఉచిత బస్సులు పెట్టింది. రాజకీయ పార్టీల నేతలు ఎవరైనా వెళ్తారంటే.. వారికీ వాహనాలు సమకూర్చింది. అక్కడ భోజనాలు ఏర్పాటు చేసింది. తాము చేస్తున్న పనిని చూపించుకుంది. కానీ ఈ ప్రభుత్వ శైలి మాత్రం భిన్నంగా ఉంది. తాము చేస్తున్న పనిని చూపించుకునేదానికి ఆసక్తి ప్రదర్శించడం లేదు. పైగా అరెస్టులు చేస్తోంది. దాంతో అక్కడ ఏమీ జరగడం లేదు కాబట్టే.. చూపించడం లేదన్న అభిప్రాయానికి సామాన్య జనం వచ్చే పరిస్థితి ఏర్పడింది.