మైదానంలోనే కాదు, బయట కూడా డేరింగ్ అండ్ డాషింగ్ నిర్ణయాలు తీసుకోగలడని గంగూలీ మరోసారి నిరూపించుకున్నాడు. కరోనా భయంతో.. ప్రపంచం అంతా అట్టుడికిపోతున్న తరుణంలో ఐపీఎల్ నిర్వహించాలన్న గంగూలీ ప్రతిపాదన అప్పట్లో నివ్వెర పరిచింది. కాసుల కోసం… గంగూలీ పెద్ద రిస్క్ చేస్తున్నాడని, ఆటగాళ్లు కరోనా బారీన పడితే పరిస్థితి ఏమిటన్న విమర్శలు చెలరేగాయి. బీసీసీఐలోని కొంతమంది పెద్దలు.. గంగూలీ నిర్ణయాన్ని అప్పట్లో తప్పుబట్టారు. మరి కొంత కాలం ఆగాలని, లేదంటే… ఈసారికి టోర్నీని పూర్తిగా ఆపేయాలని సలహా ఇచ్చారు. కానీ గంగూలీ ఎవరి మాటా వినలేదు. గంగూలీ వేసిన స్కెచ్ తో…. ఏకంగా టీ 20 వరల్డ్ కప్పే వాయిదా పడి, ఐపీఎల్ కి మార్గం సుగమం అయ్యింది.
గంగూలీ ప్లానింగ్ అద్భుతంగా సాగి, ఐపీఎల్ 13 విజయవంతంగా నడిచింది.. ఎలాంటి టెన్షన్లూ లేకుండా దిగ్విజంగా ఈ టోర్నీని పూర్తి చేయగలిగింది బీసీసీఐ. ఇప్పుడు ఈ టోర్నీ ద్వారా బీసీసీఐకి ఏకంగా 4 వేల కోట్లు వచ్చాయి. కరోనా కాలం, పైగా పెద్ద పెద్ద స్పాన్సర్లు హ్యాండిచ్చిన వేళ, స్టేడియంలో ప్రేక్షకులు కరువై, చీర్ గాళ్స్ లాంటి అదనపు హంగులు లేని వేళ… ఇంత స్థాయిలో బీసీసీఐ ఆదాయం ఆర్జించగలిగిందంటే… మామూలు విషయం కాదు.
ఖర్చులు తగ్గించి అదనపు ఆదాయ మార్గాల్ని అన్వేషించడంలో బీసీసీఐ విజయం సాధించగలిగింది. పైగా.. ఈసారి వ్యూవర్ షిప్ కూడా ఎక్కువ స్థాయిలో నమోదైంది. అందుకే ఈస్థాయిలో ఆదాయం రాబట్టగలిగింది.