ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ హఠాత్తుగా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. కేంద్ర హోంశాఖ అధికారులతో సమావేశం అయ్యారు. సాధారణంగా డీజీపీ స్థాయి అధికారులు ప్రత్యేకంగా వెళ్లి హోంశాఖ అధికారులతో సమావేశం కారు. పిలుపు వస్తేనో లేకపోతే.. సమావేశాలు ఉంటేనే వెళ్తారు. అన్ని రాష్ట్రాల డీజీపీలతో జరిగే సమావేశాలు లేదా.. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల డీజీపీల సమావేశం ఇలా.. ప్రత్యేకంగా నిర్వహించే సమావేశాలకు వెళ్తారు. ప్రస్తుతం అలాంటిదేమీ లేకపోయినా… గౌతం సవాంగ్ ఢిల్లీ వెళ్లారు. ఏపీలో పోలీసులకు సంబంధించిన ఓ ముఖ్య కార్యక్రమం ఉన్నా.. ఆయన హాజరు కాలేదు. ఆటోలు, క్యాబుల్లో ప్రయాణికుల భద్రత కోసం.. అభయం అనే యాప్ను రూపొందించారు. దీన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు.
సాధారణంగా నేరుగా పోలీసులకు సంబంధం లేకపోయినా.. చాలా కార్యక్రమాల్లో ఇలా జగన్మోహన్ రెడ్డి ల్యాప్ ట్యాప్ మీట నొక్కే కార్యక్రమానికి డీజీపీ సవాంగ్ హాజరవుతారు. సీఎం కూర్చుని ఉంటే.. ఆయన వెనుక నిలబడి ఉండే.. మంత్రులు, ఉన్నతాధికారుల్లో ఆయన కూడా ఉండేవారు. కానీ ఈ సారి మాత్రం ఆయన లేదు. ఇతర అధికారులు నిలబడి ఉన్నారు. దీంతో గౌతం సవాంగ్ ఢిల్లీ వెళ్లారన్న విషయం అధికారవర్గాల్లో ప్రచారానికి వచ్చింది. ఇటీవలి కాలంలో పలువురు ఐపీఎస్లు కేంద్ర సర్వీసుల ఆప్షన్ పెట్టుకుంటున్నారు. కోర్టుల నుంచి పదే పదే హెచ్చరికలు వస్తున్నాయి.
మూడు సందర్భాల్లో పోలీసులపై సీబీఐ విచారణ కూడా ఆదేశించింది. ఏపీలో రూల్ ఆఫ్ లా అమలు కావడం లేదని కోర్టు పదే పదే విమర్శిస్తోంది. అదే సమయంలో కోర్టుల్ని దూషించిన వారిపై చర్యలు తీసుకునే విషయంలో పోలీసులు ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. పోలీసుల వ్యవహారశైలిపై కేంద్రానికి కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి. ఇలాంటి సమయంలో.. గౌతం సవాంగ్ హుటాహుటిన ఢిల్లీ వెళ్లడం.. కేంద్ర హోంశాఖ అధికారులతో సమావేశం అవడం… రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది.