13 ఏళ్ల ఢీ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ సిద్ధం అవుతోంది. `డీ అండ్ డీ` అంటూ ఓ మంచి టైటిల్ ఫిక్స్ చేశారు. అనుకున్నట్టే… విష్ణు, శ్రీనువైట్ల మరోసారి జట్టు కట్టారు. అటు శ్రీనువైట్లకు, ఇటు విష్ణుకీ ఇప్పుడు హిట్లు లేకపోవొచ్చు. ఇద్దరూ ట్రాక్‌లో ఉండకపోవొచ్చు. కానీ ఢీ సీక్వెల్ అనగానే.. కచ్చితంగా అంచనాలు ఏర్పడతాయి. సినిమాని సేల్ చేసుకోవడంలో… నిర్మాతగా మంచు విష్ణుకి ఎలాంటి ఆటంకాలూ లేకపోవొచ్చు.
కానీ శ్రీనువైట్ల ముందు రెండు ఇబ్బందులున్నాయి. ఒకటి… కథ ఎలా ఉన్నా, వినోదం పరంగా శ్రీనువైట్ల మ్యాజిక్ చేయాలి. విలన్ ఇంట్లో హీరో దూరి, బకరాని చేయడం `ఢీ` స్టైల్. అప్పటి నుంచీ ఈ ఫార్ములా ఓ ట్రెండ్ గా మారిపోయింది. ఇప్పుడూ అదే ఫార్ములా అంటే ఏమాత్రం కుదరదు. ఆ స్థానంలో ఓ సరికొత్త ఫార్ములా పట్టుకుని తీరాల్సిందే. శ్రీనువైట్ల సైతం.. ఓ కొత్త పద్ధతిలో ఈ కథని రాసుకున్నట్టు తెలుస్తోంది. అయితే.. కథ మాట అంటుంచితే… శ్రీహరి ని రీప్లేస్ చేయడం చాలా కష్టం. `ఢీ`లో శ్రీహరి పోషించిన పాత్ర బాగా క్లిక్ అయ్యింది. ఆ సినిమా తరవాతే… శ్రీహరి క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయ్యాడు. ఇప్పుడు శ్రీహరి లేడు. కానీ.. `ఢీ అండ్ ఢీ`లో ఆ స్థాయి పాత్ర ఒకటి ఉండాలని ప్రేక్షకులు తప్పకుండా ఆశిస్తారు. `ఢీ అండ్ ఢీ`లోనూ అలాంటి క్యారెక్టర్ ఒకటి ఉందట. అయితే ఆ పాత్రలో ఎవరు కనిపిస్తారో చూడాలి. శ్రీహరిలా… డైలాగులు పవర్ ఫుల్ గా చెప్పి, కథకు వెన్నెముకలా నిలబడే నటుడు ఇప్పుడు శ్రీహరికి కావాలి. అలాంటి నటుడ్ని వెదికి పట్టుకునే పనిలో ఉన్నాడని టాక్. ఢీ కి ఏ విషయాల్లో మ్యాజిక్ జరిగిందో.. అలాంటి మ్యాజిక్కే ఢీ సీక్వెల్ లోనూ జరగాలి. కాకపోతే.. ఇది పనిగట్టుకుని చేయకూడదు. అలా కుదిరిపోవాలంతే. మరి ఈ సారి ఏం జరుగుతుందో…?