థియేటర్లు తెరచుకోవడానికి అనుమతులు ఇస్తూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఓ జీవోని విడుదల చేసింది. అయితే కొన్ని షరతులు విధించింది. సిట్టింగ్ సామర్థ్యాన్ని 50 శాతానికి పరిమితం చేసింది. ప్రతి ప్రేక్షకుడూ.. కచ్చితంగా మాస్క్ ధరించే థియేటర్లోకి అడుగుపెట్టాలని, థియేటర్ ఆవరణలో శానిటైజర్లు ఉంచాలని స్పష్టం చేసింది. ప్రేక్షకులు భౌతిక దూరం పాటించేలా థియేటర్ యాజమాన్యం జాగ్రత్త వహించాలని, థియేటర్ ఆవరణలో గుంపులు గుంపులుగా తిరగడం నిషేధించామని జీవోలో స్పష్టం చేశారు. ప్రతి షో ముందు కామన్ ఏరియాలో సానిటీజేషన్ చేయాలని, ఉష్ణోగ్రతలను 24 నుంచి 30 డిగ్రీ సెల్సీయస్ మధ్య ఉంచాలని, హ్యూమిడిటిని 40 నుంచి 70 శాతం మధ్య ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
థియేటర్లు తెరచుకోవడం శుభవార్తే అయినా… 50 శాతం సిట్టింగ్ కి నిర్మాతలు మొగ్గు చూపిస్తారా, లేదా? అన్నది ప్రధాన సమస్యగా మారింది. విమానాల్లో, బస్సుల్లో, రైల్వేలలో… 50 శాతం సిట్టింగ్ అన్న షరతులు లేవు. అలాంటిది థియేటర్లకు మాత్రం ఎందుకన్నది నిర్మాతల ప్రశ్న. పెద్ద సినిమాలు విడుదలకు రెడీగా లేకపోయినా.. చిన్న సినిమాలు మాత్రం విడుదలకు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఏదేమైనా – థియేటర్లు తెరచుకోవడం చిత్రసీమకు ఓరకంగా భారీ ఊరట అని చెప్పాలి.