దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు .. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులకు క్షమాపణలు చెప్పారు. వైఎస్ కుటుంబాన్ని తాను కించపర్చలేదని.. తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు. ఇంతకీ ఆయన ఎందుకు వివరణ ఇవ్వాల్సి వచ్చిందంటే… ఆదివారం మీడియాతో మాట్లాడిన రఘునందన్ రావు .. మాటల సందర్భంలో వైఎస్ మరణం గురించి ప్రస్తావించారు. సందర్భం లేకపోయినా .. వెనకటికొకరు పావురాల గుట్టలో పావురమైపోయారని వ్యాఖ్యానించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. రఘునందన్ రావు.. వైసీపీ వ్యతిరేకుల్ని ఆకట్టుకునేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్న అభిప్రాయాలు వినిపించాయి. అయితే.. సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కొంత మంది .. రఘునందన్ రావుకు వ్యతిరేకంగా విస్తృతంగా ప్రచారం ప్రారంభించారు.
చనిపోయిన వారి గురించి అనుమచితంగా మాట్లాడారని.. విమర్శించడం ప్రారంభించారు. వైఎస్ఆర్ ఫ్యాన్స్ పేరుతో ఆయనకు బెదిరింపులు కూడా వచ్చాయి. కూకట్పల్లిలో ప్రచారం చేస్తున్న రఘునందన్ రావును వైఎస్ఆర్ ఫ్యాన్స్ అంటూ నలుగురైదుగురు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో రఘునందన్ రావు.. క్షమాపణలు చెప్పారు. తాను వైఎస్ ఫ్యామిలీని కించ పర్చలేదన్నారు. అసలు ఈ ఎపిసోడ్ మొత్తంలో…వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు.. రఘునందన్ రావుకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడంతో… ఇలాంటి వ్యాఖ్యలు చేసింది మొదటగా రఘునందన్ రావు మాత్రమే కాదన్న చర్చ కూడా సోషల్ మీడియాలో ప్రారంభమయింది.
రఘునందన్ కన్నా దారుణంగా సీఎం కేసీఆర్ తిట్టారు. పావురాల గుట్టకు.. వైఎస్ మరణాన్ని ముడిపెట్టి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అయినప్పటికీ.. ఒక్కరంటే ఒక్క వైసీపీ అభిమాని కూడా కేసీఆర్ పై స్పందించలేదు. కానీ ఇప్పుడు రఘునందన్ అలా అనే సరికి.. వారికి పౌరుషం ముంచుకొచ్చింది. కేసీఆర్తో కూడా క్షమాపణలు చెప్పించుకోవాలని.. ఇతర పార్టీల సోషల్ మీడియా కార్యకర్తల నుంచి.. వైఎస్ అభిమానులకు సవాళ్లు వెళ్లాయి.