ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖలో అదానీ ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్కు ఏర్పాటుకు భారీ ప్రోత్సాహకాలు ప్రకటించింది. పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సిఫార్సుల మేరకు డేటా సెంటర్ పార్కు, ఐటీ బిజినెస్ పార్కు, నైపుణ్యాభివృద్ధి వర్సిటీ.. నిర్మాణాలకు మధురవాడలో 130 ఎకరాలు కేటాయించారు. భూమి ఇచ్చిన మూడేళ్లలోపు కార్యకలాపాలు ప్రారంభించాలని షరతు విధించారు. అలాగే ఏడేళ్లలోపు నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు. డేటా సెంటర్ పార్కు, ఐటీ బిజినెస్ పార్కుకు.. 20 ఏళ్లపాటు విద్యుత్ ప్రోత్సాహకాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశఆరు. డేటా సెంటర్కు ఇచ్చిన భూమిలో నివాసాలు ఉండొద్దని స్పష్టం చేసింది. నిజానికి గత ప్రభుత్వంతో అదానీ ఎంటర్ ప్రైజెస్ డేటా సెంటర్ కోసం ఒప్పందంచేసుకుంది.
రూ .70 వేల కోట్ల పెట్టుబడి పెడుతూ..అదానీ డేటా సెంటర్, టెక్నాలజీ పార్కు ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఘనంగా శంకుస్థాపన కూడా జరిగింది. అయితే ఏపీలో వైసీపీ అధికారం చేపట్టిన వెంటనే విశాఖలో గత ప్రభుత్వం తీసుకు వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనలన్నింటినీ నిలిపివేసింది. లూలూగ్రూప్ కూడా వెళ్లిపోయింది. శంకుస్థాపన జరిగినప్పటికీ అదానీ డేటాసెంటర్ కూడా.. వెనుకడుగు వేసింది. మరో కంపెనీతో కలిసి హైదరాబాద్లో డేటా సెంటర్ పెడుతుున్నట్లుగాప్రకటించింది. అయితే అధికారికంగా తాము ఏపీలో పెట్టుబడులు ఉపసంహరించుకున్నమని ప్రకటించలేదు.
కానీ రెండేళ్లుగా ఎలాంటి ముందడుగు పడలేదు. ఈ లోపు కాపులుప్పాడలో అదానీకి కేటాయించిన భూముల్ని ప్రభుత్వం వెనక్కితీసుకుంది. ఇప్పుడు నేరుగా మధురవాడలోనే 130 ఎకరాలు కేటాయించింది. అనేక రాయితీలు ఇచ్చింది. అయితే.. అదానీ గ్రూప్ నుంచి మాత్రం ఇంత వరకూ అధికారికంగా పెట్టుబడులు పెట్టబోతున్నట్లుగా ప్రకటన రాలేదు. గత కేబినెట్ భేటీలో భూముల కేటాయింపు నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత విజయసాయిరెడ్డి అహ్మదాబాద్ వెళ్లి అదానీని కలిసినట్లుగా ఫోటోలు బయటకు వచ్చాయి.కానీ ఆ కంపెనీ నుంచి మాత్రం అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.