అధికార, ప్రతిపక్ష పార్టీలన్నాక ఒకదానిపై మరొకటి విమర్శలు చేసుకోవడం సహజమే. కానీ ఒక్కోసారి ఆ ఆరోపణలు చాలా తీవ్రంగా ఉన్నప్పుడే ప్రజలను కూడా ఆలోచింపజేస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బారీ నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసారు. ఇంతకు ముందుపట్టిసీమ ప్రాజెక్టును అడ్డుకొనేందుకు విఫలయత్నాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుని అడ్డుకోవడానికి కూడా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు వలన ప్రభావితమయ్యే ఇరుగుపొరుగు రాష్ట్రాలకు, అలాగే కేంద్రానికి తప్పుడు సమాచారం అందిస్తూ వారిలో అపోహలు, అనుమానాలు రేకెత్తిస్తూ వారి ద్వారా పోలవరం ప్రాజెక్టు ముందుకు కదలకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. కానీ తమ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కట్టుబడి ఉందని దేవినేని అన్నారు.
దేవినేని చేస్తున్న ఆరోపణలకు ఆధారాలున్నాయో లేదో తెలియదు కానీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టుని అడ్డుకోవడానికి అటువంటి కుట్రలు పన్నుతున్నట్లయితే అది రాజకీయంగా ఆత్మహత్యతో సమానమే. అలాకాక దేవినేని నిరాధారమయిన ఆరోపణలు చేస్తున్నట్లయితే, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేమని తెదేపా గ్రహించినందున ప్రజలను తప్పు ద్రోవ పట్టించడానికే ఆ విధంగా చేస్తున్నట్లు భావించవలసి ఉంటుంది. ఏమయినప్పటికీ చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా పోలవరం ప్రాజెక్టుని 2019 ఎన్నికలలోగా పూర్తి చేయడం అసాధ్యమనే విషయం స్పష్టమవుతోంది.