నాని కొత్త సినిమాకి `అంటే.. సుందరానికీ..` అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకుడు. ఇటీవల టైటిల్ టీజర్ ఒకటి బయటకు వచ్చింది. అది కూడా యమ ఇంట్రస్టింగ్ గా ఉంది. ఇదో రొమాంటిక్ ఎంటర్టైనర్. కథ కూడా కూపీగా బయటకు వచ్చేసింది.
నాని ఓ బ్రాహ్మణ అబ్బాయి. ఇంట్లో సంప్రదాయాలు బాగా పాటిస్తారు. అలాంటి అబ్బాయి… ఓ క్రీస్టియన్ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇంట్లో మాత్రం `ఆ అమ్మాయి బ్రాహ్మిణే` అని అబద్ధం చెబుతాడు. అసలు.. బ్రాహ్మిణులు ఎలా ఉంటారు? వాళ్ల వేషభాషలేంటి? అనే విషయాల్లో ప్రేమించిన అమ్మాయికి యమ ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ల కుటుంబంతో సహా ఇంటికి తీసుకొస్తాడు. ఇక్కడి నుంచి కథ ఏ రూట్లో వెళ్లిందన్నది ఆసక్తికరం. ప్రేమలో కులాల ప్రస్తావన తీసుకురావడం సహజమైన విషయమే. అయితే.. దానికి వినోదపు పూత పూసే ప్రయత్నం చేస్తున్నారిందులో. ప్రతీ సన్నివేశాన్నీ లైటర్ వేలో చెప్పబోతున్నార్ట.
అయితే.. దాదాపు ఇలాంటి కథాంశంతోనే.. ఇది వరకు కొన్ని సినిమాలొచ్చాయి. సీమ శాస్త్రిలో.. హీరో, తన కుటుంబంతో సహా, రాయలసీమకు వెళ్లి ప్రగల్భాలు పలుకుతుంటాడు. అక్కడ జరిగే హంగామా అంతా నవ్వులు పూయిస్తుంది. దాదాపు నాని సినిమా కథ కూడా ఇదే లైన్. కాకపోతే.. హీరో ప్లేసులో హీరోయిన్, హీరోయిన్ ప్లేసులో హీరో ఉన్నారంతే. పైగా… నాని కామెడీ టైమింగ్ వేరుగా ఉంటుంది. కాబట్టి ఈ కథకు తప్పకుండా కొత్త ఫ్లేవర్ వచ్చి తీరుతుందంతే.